Share News

CM Revanth Reddy: భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Nov 30 , 2025 | 07:38 PM

డిసెంబర్‌ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌పై (Telangana Rising Global Summit) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(ఆదివారం) కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంట్లపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయం పెంచుతామని..పేదలకు పంచుతామని వివరించారు. తెలంగాణకు రెండో మణిహారం రెడీ చేసుకుంటున్నామని.. రాష్ట్రానికి నాలుగు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.


అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంట్ల గురించి వివరించారు. విజన్‌ డాక్యుమెంట్‌లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.


ఒకటి విజన్‌, రెండోది స్ట్రాటజీ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని వ్యాఖ్యానించారు హైదరాబాద్‌ ORR లోపలి ఏరియాలో వివిధ విభాగాల పాలన ఉందని తెలిపారు. అందుకే ఈ ప్రాంతం మొత్తాన్ని కోర్‌ అర్బన్‌ రీజియన్‌గా గుర్తించామని చెప్పుకొచ్చారు. కాలుష్య రహితంగా హైదరాబాద్‌ను మార్చాల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


రేపు, ఎల్లుండి ఈ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి ఆంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. డిసెంబరు 2వ తేదీ రాత్రికి అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డిసెంబరు 3, 4 తేల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎస్ , సీఎంవో అధికారులు పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులను చేసి తుది ప్రతి సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలని హుకుం జారీ చేశారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.

Updated Date - Nov 30 , 2025 | 07:59 PM