Share News

CM Revanth Child Protection: రండి.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం.. సీఎం విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:18 PM

CM Revanth Child Protection: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ ‘భరోసా’ ప్రాజెక్టును తీసుకొచ్చిందని.. అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

CM Revanth Child Protection: రండి.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం.. సీఎం విజ్ఞప్తి
CM Revanth Reddy

హైదరాబాద్, జులై 5: వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్‌తో తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (శనివారం) ఎమ్‌సీఆర్‌హెచ్‌ఆర్‌డీలో బాలల లైంగిక వేధింపులు, రక్షణ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఎంతో కీలకమైన అంశంపై సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీస్‌, ఇతర నిర్వహకులను సీఎం అభినందించారు. ఇలాంటి నేరాలను నియంత్రించడమే కాకుండా బాల బాధితులకు చట్టపరమైన అన్ని రకాల రక్షణ కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లైంగిక వేధింపుల నుంచి అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.


పిల్లలు, మహిళల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ ‘భరోసా’ ప్రాజెక్టును తీసుకొచ్చిందని.. అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పోలీసు సహాయమే కాకుండా న్యాయపరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సేవలను అందిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడమే ఈ కేంద్రాల లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఫోక్సో చట్టం, జువెనైల్ చట్టాలు మన ప్రగతిశీల సాధనాలుగా పనిచేస్తున్నాయని... అయితే ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.


సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరిగే దురాఘతాలు, దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపకుండా దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. న్యాయం కేవలం కోర్టుల్లోనే కాకుండా ప్రతీ దశలోనూ రక్షణ ఉండాలని సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో అన్ని ప్రక్రియల ద్వారా పిల్లలకు న్యాయం దక్కాలని.. రక్షణ కల్పించాలని తెలిపారు. ‘న్యాయమూర్తులు, పోలీసు అధికారులు బాలల సంక్షేమ కమిటీలు, ఇతర అభివృద్ధి భాగస్వామ్య సభ్యులందరికీ... విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. న్యాయమంటే కేవలం శిక్షలు విధించడం వరకే కాదు. బాధితుల జీవితానికి భరోసా కల్పించాలి. వారికి అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకుని వారి బాల్యాన్ని తిరిగి పొందేలా చర్యలు ఉండాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

గంజాయి స్మగ్లింగ్‌లో కొత్త పంథా.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా జగ్గారెడ్డి.. ఎందుకంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2025 | 04:43 PM