Insta Reel Family Violence: రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఇన్‌స్టా రీల్
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:31 AM
Insta Reel Family Violence: ఇన్‌స్టాగ్రామ్ రీల్ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వరంగల్, జులై 5: జిల్లాలోని కొత్తవాడలో గత అర్థరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో (Instagram Reel) వివాదం తలెత్తింది. దీంతో రెండు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న ఓ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో యువకులు, పలువురు మహిళలు రెచ్చిపోయారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను అడ్డుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. కొత్తవాడకు చెందిన ఓ బాలుడు, బాలిక తాము ప్రేమించుకుంటున్నామంటూ ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బాలిక కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలుడి ఇంటిపై బాలిక కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని దాడికి యత్నించారు. వెంటనే బాలుడి కుటుంబసభ్యులు కూడా ప్రతిఘటించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొందరు యువకులు కత్తులు, కర్రలతో దాడికి దిగారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు అర్ధరాత్రి గుమిగూడి బాలుడి ఇంటి వద్ద గొడవకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి, మారణాయుధాలతో రోడ్డుపైకి వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. బాలికను సదరు బాలుడు కావాలనే లొంగదీసుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడని బాలిక బంధువులు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టీమిండియాతో పెట్టుకుంటే ఇట్లుంటది!
వైద్య కళాశాలల స్కాంలో.. బత్తల రింగ్‌మాస్టర్
Read Latest Telangana News And Telugu News