Anti Drugs Day: యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:08 AM
Anti Drugs Day: భవిష్యత్‌లో సమాజాన్ని కాపాడటానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సంకల్పం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాదక ద్రవ్యాల కేసులు వస్తే కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేశారు.

హైదరాబాద్, జూన్ 25: అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (Anti Drugs Day ) సందర్భంగా నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar), హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand), సినీ హీరో నిఖిల్ (Hero Nikhil) హాజరయ్యారు. డ్రగ్స్ వాడకంపై వ్యతిరేకంగా మంత్రులు, టీజీ న్యాబ్ ఉన్నతాధికారులు షార్ట్ ఫిలింను రిలీజ్ చేశారు. అలాగే డ్రగ్స్ నివారణపై పోస్టర్లను మంత్రులు విడుదల చేశారు.
ప్రభుత్వ సంకల్పం ఇదే: మంత్రి పొన్నం
భవిష్యత్‌లో సమాజాన్ని కాపాడటానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సంకల్పం తీసుకుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాదక ద్రవ్యాల కేసులు వస్తే కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు జాబ్స్‌తో బిజీగా ఉంటున్నారని.. ఈ క్రమంలో పిల్లలు చెడుకు బానిసలు అవుతున్నారన్నారు. డ్రగ్స్ ఎవరు తీసుకున్నా ప్రభుత్వానికి , పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు గోవా వెళ్లి డ్రగ్స్ ముఠా చైన్ కూడా బ్రేక్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారిని సమాజం నుంచి బహిష్కరించాలన్నారు. మాదక ద్రవ్యాలు తెలంగాణలో కనబడవద్దు అనే నినాదంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
డ్రగ్స్ నివారణే ధ్యేయంగా: మంత్రి అడ్లూరి
ప్రపంచంలో తెలంగాణ పోలీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. డ్రగ్స్ నివారణపై పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. డ్రగ్స్ నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మంత్రి కోరారు.
డ్రగ్స్ నివారణపై సీఎం సీరియస్: సీపీ
వారం రోజుల పాటు డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కోవిడ్ తర్వాత , కోవిడ్ సమయంలో లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో యువత నిర్బంధానికి గురి అయ్యారని.. ఆ సమయంలో ఫ్రెండ్స్ గ్రూప్స్‌గా ఏర్పడి డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నివారణపై చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ నివారణపై ప్రతీసారి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. డ్రగ్స్ అమ్మేవారిని, రవాణా చేసేవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నామన్నారు. డ్రగ్స్‌కు బానిస అయిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. 7, 8 తరగతి స్టూడెంట్స్ కూడా డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ కంట్రోల్ చేస్తున్న లిస్ట్‌లో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సీపీ ఆనంద్ వెల్లడించారు.
అలా ఉంటేనే జీవితం సంతోషమయం: నిఖిల్
డ్రగ్స్‌కు దూరంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుందని సినీ హీరో నిఖిల్ అన్నారు. చిన్నపుడు నుంచి సిగరెట్, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం వల్లే తన జీవితం సంతోషంగా ఉందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. జీవితంలో హీరో, డాక్టర్, యాక్టర్, సైంటిస్ట్ అవ్వాలి అంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలని హీరో నిఖిల్ పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు వివిధ కళాశాల విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్..దమ్ముంటే అసెంబ్లీకి రా
Read latest Telangana News And Telugu News