Hyderabad: ఏడాదిన్నరలో.. ముగ్గురు నేతలను కోల్పోయిన జూబ్లీహిల్స్
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:08 AM
ఏడాదిన్నరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముగ్గురు నేతలను కోల్పోయింది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతలు కావడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈనెల 8వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు.

- ఎమ్మెల్యే మాగంటి, కార్పొరేటర్ షాహీన్‌బేగం, మాజీ కార్పొరేటర్ షరీఫ్ మృతి
- నాయకులు, ప్రజలు దిగ్బ్రాంతి
హైదరాబాద్: ఏడాదిన్నరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills Constituency) ముగ్గురు నేతలను కోల్పోయింది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతలు కావడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈనెల 8వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు. అక్టోబర్ 2023లో ఎర్రగడ్డ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ షరీఫ్ అనారోగ్యంతో మృతిచెందారు. అది తట్టుకోలేని సతీమణి ఎర్రగడ్డ కార్పొరేటర్ మహ్మద్ షాహీన్‌బేగం కేవలం ఎనిమిది నెలల్లోనే జూన్ 2024లో మృతిచెందారు.
మూడు పర్యాయాలు భార్యాభర్తలే కార్పొరేటర్లు
ఎర్రగడ్డ డివిజన్‌కు మూడు పర్యాయాలు భార్యాభర్తలే కార్పొరేటర్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మహ్మద్ షరీఫ్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఎర్రగడ్డ డివిజన్‌ను మహిళకు రిజర్వు అయింది. దీంతో ఆయన సతీమణి షాహీన్‌బేగంకు ఎంఐఎం పార్టీ నుంచి రెండు పర్యాయాలు టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. నిధులను మంజూరు చేయించి డివిజన్‌ను అభివృద్ధి చేయడంలో ఎంతగానో కృషి చేశారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కార్పొరేటర్ షాహీన్‌బేగం మృతిచెంది సంవత్సరం గడిచి నా ఎన్నిక నిర్వహించలేదు.
మూడుసార్లు ఎమ్మెల్యే
1983లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన మాగంటి గోపీనాథ్ ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి, రెండుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2022 జనవరి నుంచి ఆయన బీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఆయన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి దక్కలేదు.
మాగంటి తర్వాత ఎవరు?
2007లో అప్పటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి అకాల మరణం చెందారు. సానుభూతితో మిగతా పార్టీలన్నీ అతడి కుమారుడు పి.విష్ణువర్థన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు సహకరించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిచెందడంతో ఆయన తర్వాత ఎవరు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పుడు కూడా మాగంటి కుటుంబంలోని వ్యక్తిని ఎమ్మెల్యేగా నియమిస్తారా? ఎన్నికలు జరుగుతాయా? అన్న చర్చ జరుగుతోంది. ఉపఎన్నిక అనివార్యమైతే అన్ని పార్టీలు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
Read Latest Telangana News and National News