Minister: బోనం ఎత్తుకునే వారికే ప్రథమ ప్రాధాన్యం..
ABN , Publish Date - Jun 25 , 2025 | 08:37 AM
బోనాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చే వారికే ప్రథమ ప్రాధాన్యమిస్తామని, వారికి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

- సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
సికింద్రాబాద్: బోనాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చే వారికే ప్రథమ ప్రాధాన్యమిస్తామని, వారికి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. వచ్చే నెల 13, 14 తేదీల్లో జరిగే లష్కర్ బోనాల జాతర ఏర్పాట్లపై ఆయన మంగళవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయం ప్రాంగణంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కొన్ని సమస్యలు, వీఐపీ పాస్‌లపై కొందరు ప్రశ్నించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ భక్తుల తర్వాతే మిగతా వారి గురించి ఆలోచిస్తామని తెలిపారు.
వీఐపీలు రద్దీ తక్కువ ఉన్న సమయంలో వస్తే మంచిదని సూచించారు. గతేడాది పొరపాట్లను సమీక్షించుకుని, స్థానికుల సహకారంతో బోనాలను విజయవంతం చేద్దామన్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో నగర ప్రజలు ఎవరికీ తీసిపోరని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానికులు ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. ఆలయంలో, లోపల పటిష్ఠమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డికి సూచించారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav) మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు. అమ్మవారి బోనాల జాతర, రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ దాసరి హరిచందన, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావ్, వాటర్ బోర్డు డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
Read Latest Telangana News and National News