Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:28 AM
Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4013 పోన్ నెంబర్లను ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాపింగ్ చేశారు. వారిలో 618 మంది పొలిటికల్ లీడర్ల పోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, జూన్ 25: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఏకంగా 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు అండ్ టీమ్ అంగీకరించారు. అందులో 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. 618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలకు సిట్ నోటీసు ఇవ్వనుంది. ఐఏఎస్‌లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. మొత్తం 618 మంది స్టేట్‌మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్ రికార్డింగ్‌లు పూర్తి అయ్యాయి.
ఇప్పటి వరకు కేవలం 2023 నవంబర్ నెలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ డాటా మాత్రమే విచారణ అధికారుల వద్ద ఉంది. మిగిలిన డాటా మొత్తం కూడా ధ్వంసం అయిన విషయం తెలిసిందే. 618 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలను బట్టి ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేయగా.. మరికొంత మంది స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేయనుంది సిట్. ఇంతటి సంచలనమైన కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారుల వరకు మాత్రమే విచారణ, అరెస్ట్‌లు జరుగగా.. అధికారుల వెనక ఉన్న అప్పటి బీఆర్‌ఎస్ నేతలు ఎవరనేది మాత్రం దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
సిట్ ఆఫీస్‌కు గడ్డం చంద్రశేఖర్
మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ లీగల్ సెల్ చైర్మెన్ దేవరాజు గౌడ్‌కు సిట్ బృందం నుంచి ఫొన్ వచ్చింది. దీంతో ఈరోజు (బుధవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పీఎ కరుణాకర్ రెడ్డి, డ్రైవర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు అరవింద్ సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో పలుమార్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై పోలీసుల రైడింగ్ కూడా జరిగింది.
ఇవి కూడా చదవండి
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్..దమ్ముంటే అసెంబ్లీకి రా
Read latest Telangana News And Telugu News