Share News

Srushti Test Tube Baby Scam: చంచల్‌గూడ జైలుకు సృష్టి కేసు నిందితులు.. కోర్టు 14 రోజుల రిమాండ్..

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:31 PM

'సృష్టి' కేసులో అరెస్టయిన నిందితులను ఆదివారం మారేడుపల్లి జడ్జి నివాసంలో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.

Srushti Test Tube Baby Scam: చంచల్‌గూడ జైలుకు సృష్టి కేసు నిందితులు.. కోర్టు 14 రోజుల రిమాండ్..
Srushti fertility scam

హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టయిన నిందితులకు మారేడుపల్లి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న డాక్టర్ నమ్రత పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేశంలో అనేక చోట్ల సృష్టి ఆస్పత్రికి సంబంధించి బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటన్నింటిలో సరోగసి, IVF, IUI విధానాల ద్వారా పిల్లలు కలిగిస్తామని చెప్పి భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భారీ మొత్తంలో వైద్యం కోసం వచ్చేవారి నుంచి డబ్బులు గుంజుతున్న డాక్టర్ నమ్రత ముఠా గుట్టును రట్టు చేసే పనిలో పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి.


సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌ బజార్‌లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టి పోలీసులు, వైద్యాధికారులు పలు కీలక పత్రాలను, వీర్య కణాల శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఇండియన్‌ స్పెర్మ్‌ టెక్‌ సంస్థకు, సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌కు మధ్య సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. సరోగసి పేరిట పలువురి నుంచి వీర్యం, అండాలను సేకరించి గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.


అనుమతులు లేకుండా రెజిమెంటల్‌ బజార్‌లో ఇండియన్‌ స్పెర్మ్‌ టెక్‌ సంస్థను నిర్వహిస్తున్నందుకు గాను.. ఆ సంస్థ రీజినల్‌ మేనేజర్‌ పంకజ్‌ సోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్‌తోపాటు జితేందర్‌, శివ, మణికంఠ, సంపత్‌, శ్రీను, బోరోను అరెస్టు చేశారు. అయితే తొమ్మిదేళ్ల క్రితమే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను సీజ్ చేశారు. కానీ, డాక్టర్ నమ్రత అక్రమంగా అనుమతులు పొంది మళ్లీ నిర్వహిస్తున్నారు. యువకులకు డబ్బు ఆశ చూపి అక్రమంగా వీర్యం సేకరిస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఎవరైనా దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వస్తేనే.. విజయవాడ నుంచి డాక్టర్ నమ్రత వస్తుండటం గమనార్హం.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన సోనియా దంపతులు నాలుగేళ్ల నుంచి సికింద్రాబాద్‌లో నివసిస్తున్నారు. సంతానసాఫల్యత కోసం మూడేళ్ల కిందట డాక్టర్ నమ్రతను సంప్రదించారు. రూ.30 లక్షలు చెల్లించి సరోగసి ద్వారా మగబిడ్డను పొందారు. కానీ, పుట్టిన కొన్నాళ్లకే బిడ్డకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. షరతు ప్రకారం, డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని సృష్టి యాజమాన్యాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేసినా వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో సరోగసికి ఒప్పుకున్న మహిళతో పాటు సోనియా దంపతులు ఢిల్లీ డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో తమ బిడ్డ కాదని తేలడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

'సృష్టి' కేసులో బిగ్ ట్విస్ట్.. IVF అవసరం లేకున్నా తప్పుదోవ..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 02:03 PM