Brain Damaging Foods: న్యూరోసర్జన్ల హెచ్చరిక.. ఈ ఫుడ్స్ తింటే మీ బ్రెయిన్ ఖతం
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:20 PM
మెదడుకు హాని చేసే మూడు ఆహారాలను అస్సలు టచ్ చేయొద్దని న్యూరో డాక్టర్స్ చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: మనం తినే ఆహారం మెదడుపై పెను ప్రభావం చూపెడుతుందని న్యూరోసర్జన్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, జీవితాంతం మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు. అయితే, మనం సాధారణంగా తినే ఫుడ్స్ మెదడుకు సైలెంట్‌గా చేటు చేస్తున్నాయని న్యూరో డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రకాల ఆహారాల జోలికి అస్సలు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, ప్యాకెట్స్‌లో లభించే ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. చిప్స్ నుంచి పేస్ట్రీల వరకూ అనేక ఫుడ్స్ ఈ కోవలోకే వస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల మెదడులో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది అనేక మెదడు సమస్యలకు దారి తీస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారాలకు బదులు కూరగాయలు, తృణధాన్యాలతో ఇంట్లో వండుకున్న ఆహారం తింటే బెటరని నిపుణులు చెబుతున్నారు.
చక్కెర అధికంగా ఉండే పానీయాలు మెదడుకూ చేటు చేస్తాయి. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సడెన్‌గా పెరుగుతాయి. ఇది బ్రెయిన్ ఫ్యాటిగ్‌కు దారి తీస్తుంది. దీర్ఘకాలంలో మెదడు కుంచించుకుపోతుంది. చక్కెర పానీయాల కారణంగా మెదడు సైజు తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. కాబట్టి, ఇలాంటి డ్రింక్స్‌కు బదులు హెర్బల్ టీ, చక్కెర లేని ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇక అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో జీర్ణవ్యవస్థకు మెదడుకు మధ్య ఉన్న సంబంధం దెబ్బతింటుందని న్యూరోసర్జన్స్ చెబుతున్నారు. పేగుల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఇన్‌ఫ్లమేషన్ పెరిగి మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరు కూడా దెబ్బతింటుంది. ఫలితంగా ఆందోళన, డిప్రెషన్, మెదడు సామర్థ్యాలు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, మెదడు ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలని న్యూరో డాక్టర్స్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
తెల్లవారుజామున 3 - 5 గంటల మధ్య మెళకువ వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త