Share News

IPL 2026: సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్

ABN , Publish Date - Nov 16 , 2025 | 10:50 AM

రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాదలే మాట్లాడాడు. సంజూ కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

IPL 2026: సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్‌తో 12 ఏళ్ల అనుబంధం.. 18 ఏళ్లుగా జట్టును గెలిపించేందుకు అతడు పడుతున్న తపన.. మధ్యలో ఫామ్ లేమి.. వీటి మధ్య నలిగిన టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ ఈ ఏడాది ఆర్ఆర్‌ను వీడాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రేడ్ ద్వారా సంజూను సొంతం చేసుకుంది. రూ.14కోట్లకు రవీంద్ర జడేజా, రూ.2.40కోట్లకు సామ్ కరన్ రాజస్థాన్ జట్టులో చేరగా.. రూ.18కోట్లకు సంజూ చెన్నైలో గూటికి చేరాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాదలే(Manoj Badale) సంజూ జట్టును వీడటంపై స్పందించాడు.


భారంగా ఫీలయ్యాడు..

‘గతేడాది కేకేఆర్‌తో మ్యాచ్ సమయంలోనే సంజూ(Sanju Samson) జట్టును వీడాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆర్ఆర్‌లో శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు అప్పుడే వెల్లడించాడు. ఆ మ్యాచ్ అనంతరం మేం సంజూతో మాట్లాడాం. అతడు చాలా నిజాయితీగా ఉంటాడు. అందుకే ఈ విషయాన్ని నిస్సంకోచంగా చెప్పేశాడు. 18 ఏళ్లుగా జట్టు కోసం చాలా కష్టపడ్డాడు. కానీ అనుకున్నంత స్థాయిలో జట్టు విజయం సాధించలేకపోయింది. అందుకే కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. ఆరోజు ఈ విషయం మాకు చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. కానీ అదే వాస్తవం’ అని బాదలే వివరించారు.


బయట ఎలా ఉన్నా..

‘సంజూని వదులుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. స్టార్ ప్లేయర్లు జట్టును వీడటంపై తెగ చర్చలు జరుగుతున్నాయి. కానీ జట్టులో అంతర్గతంగా పరిస్థితి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. సంజూ నిర్ణయం అతడి మానసిక ఆరోగ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది. ఇప్పుడు సీఎస్కేలో ఎక్కువ ఫోకస్ పెట్టి ఆడగలడు. ఎందుకంటే..కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు కూడా కొన్నిసార్లు ఆటపై ప్రభావం చూపుతాయి. సంజూ వంటి ఆటగాడు జట్టును వీడితే.. ఆర్ఆర్ పరిస్థితేంటి? అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా ఉండొచ్చు. కానీ మేం అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాం’ అని ఆయన వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

అతడిని ఆడిస్తారనుకున్నా: అనిల్ కుంబ్లే

మినీ వేలం ఎప్పుడంటే?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 10:50 AM