Share News

Nigar Sultana: నేను ఎవ్వరినీ కొట్టలేదు: బంగ్లా కెప్టెన్

ABN , Publish Date - Nov 16 , 2025 | 09:45 AM

బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానాపై మాజీ పేసర్ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో జూనియర్ క్రికెటర్లను కొడుతుందని విమర్శించింది. ఈ ఆరోపణలపై సుల్తానా స్పందించింది.

Nigar Sultana: నేను ఎవ్వరినీ కొట్టలేదు: బంగ్లా కెప్టెన్
Nigar Sultana

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటిపై ఆ జట్టు పేసర్ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డ్రెస్సింగ్ రూమ్‌లో జూనియర్ క్రికెటర్లను సుల్తానా కొడుతుందని ఆమె ఓ ఇంటర్వ్యూ వేదికగా విమర్శించింది. తాజాగా ఈ విషయంపై సుల్తానా స్పందించింది. తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేసింది.


‘నేనేమీ నియంతను కాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరి స్థానం వారికే ఉంటుంది. అందరూ ఎలాగో నేను(Nigar Sultana) కూడా అలాగే. కాకపోతే నేను కెప్టెన్ కాబట్టి నాకు కొంచెం గౌరవం ఎక్కువ ఉండొచ్చు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ అందరినీ ఒకేలా చూస్తుంది. ఈ ఆరోపణలను ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. దీని వెనక ఉన్నది ఎవరో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఎవ్వరినీ కొట్టలేదు. అయితే నేను చాలా కాలంగా బంగ్లా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. అందరూ నన్ను ఇష్టపడాలని లేదు. నేనేమీ వాటి గురించి ఆలోచించను. జట్టు కోసం ఏమీ చేస్తున్నానో.. జట్టు విజయంలో నా పాత్ర ఏంటనే దానిపైనే నా దృష్టి ఉంటుంది’ అని సుల్తానా వివరించింది.


అసలు ఏమైందంటే?

బంగ్లా మాజీ పేసర్ జహనారా ఆలం(Jahanara Alam) సుల్తానాపై ఈ ఆరోపణలు చేసింది. ‘నేను చివరిసారిగా 2024 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ తరఫున ఆడాను. నేను చెప్పే దాంట్లో కొత్తేమీ లేదు. నిగర్ సుల్తానా తన జూనియర్లను విపరీతంగా కొడుతుంది. ప్రపంచ కప్ సమయంలో కూడా ఆ ప్లేయర్లు నాతో చెప్పుకొని బాధపడేవారు. పొరపాట్లు మళ్లీ జరగవని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినకుండా అలాగే వేధిస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా తమను కొట్టిందని చాలా మంది అంటుండగా విన్నా. దుబాయ్ పర్యటన సమయంలోనూ తన రూమ్‌కు పిలిపించుకుని మరీ జూనియర్లను కొట్టింది’ అని ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది.


ఇవి కూడా చదవండి:

అతడిని ఆడిస్తారనుకున్నా: అనిల్ కుంబ్లే

మినీ వేలం ఎప్పుడంటే?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 09:45 AM