Share News

Ind Vs SA: మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్

ABN , Publish Date - Nov 12 , 2025 | 07:56 PM

ముంబైలో జరిగిన ఎస్ఏ20 ఇండియా డే కార్యక్రమంలో భారత్‌తో సిరీస్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ శత్రువుగా చమత్కరించాడు.

Ind Vs SA: మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్
Graeme Smith

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాతో రెండు టెస్టు సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. నవంబర్ 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలో, రెండో మ్యాచ్ గువాహటిలో జరగనున్నాయి. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా ఉన్న సఫారీ సేన.. గత 15 ఏళ్లుగా భారత గడ్డపై ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సారి ఎలాగైనా సఫారీ(Ind Vs SA) సేన గెలిచి తీరాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలో జరిగిన ఎస్ఏ20 ఇండియా డే కార్యక్రమంలో భారత్‌తో సిరీస్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith) మాట్లాడాడు.


‘కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మంచి గ్రౌండ్. అక్కడే ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మా జట్టులో ఉన్న ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి ఎంతో ప్రతిభావంతులు. పేసర్లు కగిసో రబాగ, మార్కో యాన్సెస్, ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్‌లకు తోడు వీరిద్దరి స్పిన్ ద్వయం భారత బ్యాటర్లకు సవాలు విసురుతుందని అనుకుంటున్నా. టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 20 వికెట్లు పడగొట్టడం చాలా ముఖ్యమైన విషయం. మా టీమ్‌పై నాకు నమ్మకం ఉంది’ అని గ్రేమ్ స్మిత్ వివరించాడు. ప్రస్తుతం భారత బౌలింగ్ కోచ్‌గా ఉన్న అతని మాజీ సహచరుడు మోర్నీ మోర్కెల్ గురించి అడగ్గా.. మోర్నీ(Morné Morkel) ఇప్పుడు మాకు శత్రువు అంటూ చమత్కరించాడు.


శుభారంభం చేయాలి..

ఎస్ఏ 20 ఇండియా డే కార్యక్రమానికి మాజీ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా హాజరయ్యాడు. ‘గత ఏడాది కాలంగా మా జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేయాలి. భారత్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లే ఉండటం దురదృష్టకరం. కొత్త షెడ్యూల్‌కు‌ ఉన్న ప్రతికూలత ఇదే. కనీసం ఒక జట్టుతో వరుసగా మూడు మ్యాచ్‌లు ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తే బాగుంటుందని’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి

వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 07:56 PM