MS Dhoni: ఐపీఎల్‌లో ధోనీ ఆడుతున్నాడు: సీఎస్కే సీఈఓ
ABN , Publish Date - Nov 07 , 2025 | 06:45 PM
ఐపీఎల్-2026లో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతాడా?, లేదా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతి సీజన్‌కు ముందు ధోనీ రిటైర్‌మెంట్‌పై ఊహాగానాలు పరిపాటిగా మారాయి. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2026లో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతాడా?, లేదా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతి సీజన్‌కు ముందు ధోనీ రిటైర్‌మెంట్‌పై ఊహాగానాలు పరిపాటిగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ ఆడనున్నాడు. ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో మాహీ రిటైర్‌మెంట్ వార్తలకు ప్రస్తుతం ఎండ్ కార్డ్ పడింది.
ధోనీ సిద్ధంగా ఉన్నాడు..
ఐపీఎల్ (IPL 2026)లో ఆడటానికి ధోనీ సిద్ధంగా ఉన్నాడని సీఎస్కే సీఈవో(CSK CEO) కాశీ విశ్వనాథన్ తెలిపాడు. ‘వచ్చే సీజన్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ధోనీ మాతో చెప్పాడు. అతడి నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ధోనీ యువతరానికి మార్గనిర్దేశం చేయడంలో కీలకం కానున్నాడు. ధోనీ ఇప్పుడే రిటైర్ అవ్వడు. అతడి ఆట ఇంకా ముగియలేదు’ అని విశ్వనాథన్ పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా సంజూ?
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్(RR)కు కెప్టెన్‌గా సంజూ శాంసన్(Sanju samson) ఆ జట్టును వీడనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సంజూ సీఎస్కేకు ట్రేడ్ చేసే చర్చలు మళ్లీ వేగం పట్టాయని సమాచారం. నవంబర్ 15కు రిటెన్షన్ గడువు ముగియనుండటంతో ఈ చర్చలు మరింత హీట్ పెంచుతున్నాయి. అయితే సంజూకి కెప్టెన్సీ ఇస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నారు. సీఎస్కే నవంబర్ 10, 11 తేదీల్లో జట్టు ప్రణాళికలపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఈఓ కాశీ విశ్వనాథన్, కెప్టెన్ రుతురాజ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పాటు ధోనీ కూడా హాజరు కానున్నారు.
234 మ్యాచ్‌లు.. 4,865 పరుగులు
ఐపీఎల్ 18 సీజన్ ముందు ధోనీ కెప్టెన్సీ వదులుకున్న సంగతి తెలిసిందే. సీజన్ మధ్యలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎడమచేతి బొటనవేలి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దాంతో, మళ్లీ సీఎస్కే సారథ్యాన్ని చేపట్టిన తలా.. కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతూ జట్టులో స్ఫూర్తిని రగిలించాడు. ఈ సీజన్‌లో ఫినిషర్‌గానూ రాణించిన ధోనీ.. 13 ఇన్నింగ్స్‌ల్లో 196 రన్స్ కొట్టాడు. ఇప్పటి వరకూ ఎల్లో జెర్సీతో 234 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 4,865 పరుగులు సాధించాడు. ఏకంగా ఐదు పర్యాయాలు (2010, 2011, 2018, 2021, 2023) సీఎస్కేను ఐపీఎల్ విజేతగా నిలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి