Mohammed Shami: ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:36 PM
మహ్మద్ షమీ చెల్లిస్తున్న నెలకు రూ.4 లక్షల భరణం తమ అవసరాలకు సరిపోవడం లేదంటూ హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై సుప్రీం షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) మాజీ భార్య హసీన్ జహాన్ మళ్లీ వార్తల్లోకెక్కారు. నెలనెలా భరణం, కుమార్తె సంరక్షణ కోసం షమీ చెల్లిస్తున్న రూ.4 లక్షలు తమ అవసరాలకు సరిపోవడం లేదంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
జీవనోపాధి పెంచండి..
కోల్‌కతా హైకోర్టు గతంలో హసీన్ జహాన్(Hasin Jahan)కు నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె సంరక్షణ కోసం రూ.2.5 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ మొత్తం సరిపోవడం లేదని ఆమె తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court) దృష్టికి తీసుకువచ్చారు. కోల్‌కతా హైకోర్టు మంజూరు చేసిన జీవనోపాధిని పెంచాలని సుప్రీంను కోరారు.
షమీ- హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకోగా, ఏడాది తర్వాత ఐరా జన్మించింది. అయితే ఇంతలోనే వారి మధ్య కలహాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2018లో హసీన్ జహాన్ షమీపై గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. తదనంతరం 2023లో జిల్లా సెషన్స్ కోర్టు షమీ నెలకు రూ.1.3 లక్షలు చెల్లించాలని ఆదేశించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ హసీన్ హైకోర్టును ఆశ్రయించడంతో మొత్తం రూ.4 లక్షలకు పెరిగింది. కానీ ఇప్పుడు ఆ మొత్తమూ సరిపోవడం లేదని ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అమ్మకానికి ఆర్సీబీ.. కొనేదెవరంటే?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి