RCB sale: అమ్మకానికి ఆర్సీబీ.. కొనేదెవరంటే?
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:22 PM
ఐపీఎల్ 2026కి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2026 మార్చి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు డియాజియో పీఎల్‌సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)కి లేఖ రాసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026(IPL 2026) ఇంకా కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విక్రయ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. 2026 మార్చి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు డియాజియో పీఎల్‌సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)కి లేఖ రాసింది.
అది విలువైన ఆస్తి..
రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్)లో పెట్టుబడిపై సమీక్ష ప్రారంభిస్తున్నట్లు యూఎస్‌ఎల్ లేఖలో పేర్కొంది. అమ్మకానికి ఆర్సీబీ పురుషులు, మహిళల జట్లు ఉన్నాయి. రెండు టీమ్స్ అమ్మకం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిచేయాలని కంపెనీ ఆశిస్తోంది. ఈ విషయంపై యూఎస్‌ఎల్ సీఈవో, ఎండీ ప్రవీణ్ సోమేశ్వర్ మాట్లాడారు. ‘యూఎస్‌ఎల్‌కు ఆర్‌ఎస్‌పీఎల్ విలువైన, వ్యూహాత్మక ఆస్తి. అయితే మా వ్యాపారానికి ఇది ప్రధానం కాదు. ఐపీఎల్ జట్టును డియాజియో కంపెనీ సొంతం చేసుకోవడం పట్ల చాలా మంది వాటాదారులు అసంతృప్తిగా ఉన్నారు’ అని తెలిపారు. అయితే మొత్తానికి ఆర్సీబీ జట్టు త్వరలోనే చేతులు మారనుంది.
పోటీలో బడా వ్యాపారవేత్తలు..
వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల దాదాపు రూ.17వేల కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేస్తోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 2010లో లీగ్ విస్తరణ సమయంలో ఆదర్ తండ్రి సైరస్ పూనావాలా ఫ్రాంచైజీ కోసం బిడ్ వేశారు. కానీ అది అతడికి దక్కలేదు. ఇక ఆర్సీబీ ప్రాంచైజీని కొనుగోలు చేయడనికి బడా వ్యాపారవేత్తలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. జేఎస్‌డబ్ల్యుూ గ్రూప్‌నకు చెందిన పార్థ్ జిందాల్ సహా ఉన్నత స్థాయి వ్యక్తులు డియాజియో మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అదానీ గ్రూప్, ఒక ప్రముఖ ఢిల్లీ వ్యాపారవేత్త కూడా ఆర్సీబీ జట్టు కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నారని పుకార్లు ఉన్నాయి. రెండు యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
చేతులు మారుతూనే..
గతంలో ఆర్సీబీ ప్రాంచైజీ ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యా సొంతం. 2016లో మాల్యా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో పడినప్పుడు డియాజియో కంపెనీ మాల్యా మద్యం కంపెనీతో పాటు ఆర్సీబీని కూడా కొనుగోలు చేసింది. 2008లో మాల్యా తిరిగి ఆర్సీబీని 111.6 మిలియన్ డాలర్ల(రూ.76 కోట్లు)కు కొనుగోలు చేశాడు. 2014లో డియాజియో యూఎస్‌ఎల్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. 2016 నాటికి మాల్యా నిష్క్రమణ తర్వాత డియాజియో ఆర్సీబీని పూర్తిగా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ జట్టును యూఎస్‌ఎల్ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఐపీఎల్‌లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలిసారిగా ఈ ఏడాది ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
దీప్తిని అందుకే వదిలేశాం: అభిషేక్ నాయర్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి