Mohammad Kaif: పెళ్లి తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు: కైఫ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:06 PM
పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో అగ్రెషన్‌తో ఉండే కోహ్లీ.. తండ్రి అయ్యాక నెమ్మదస్తుడు అయ్యాడని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతడి దూకుడికి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అగ్రెషన్‌తో ఆడుతూ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. అయితే తాజాగా విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
‘పెళ్లి తర్వాత విరాట్(Virat Kohli) చాలా మారిపోయాడు. తండ్రి అయ్యాక మరీ నెమ్మదస్తుడు అయ్యాడు. పెళ్లికి ముందు-పెళ్లి తర్వాత.. అన్నట్లు మారిపోయాడు. ఐపీఎల్(IPL)లో ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడిని కలిశాను. ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆ మ్యాచ్‌లో కగిసో రబాడ(Kagiso Rabada) బౌలింగ్‌లో విరాట్ ఫోర్ బాదాడు. ఐపీఎల్ ఫైనల్‌లో చాలా కామ్‌గా వ్యవహరించాడు. రబాడ బౌలింగ్‌లో విరుచుకుపడకపోతే మ్యాచ్ గెలవడం కష్టమని నాతో చెప్పాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అభిషేక్ శర్మ కోహ్లీ లాగే ఆడుతున్నాడు. విరాట్ ఓ గొప్ప ఆటగాడు. ఇప్పటికీ తన ఆటను మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. హడావిడి లేకుండా నెమ్మదిగా తన పని తాను చేసుకుపోతున్నాడు’ అని కైఫ్(Mohammad Kaif) వెల్లడించాడు.
అందరికీ గౌరవం ఇస్తాడు..
‘ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం.. ఎన్నో రికార్డులు.. గొప్ప ఫ్యానిజం.. ఇన్ని ఘనతలు కోహ్లీ సొంతం. కానీ అతడి వ్యవహార శైలిలో మాత్రం మార్పు రాలేదు. అప్పుడు నన్ను అన్నా అని పిలిచేవాడు.. ఇప్పుడు కూడా అదే గౌరవం నాకు ఇస్తున్నాడు. తనతో కలిసి ఆడిన ప్రతి ఒక్కరికీ అంతే గౌరవం ఇస్తాడు. ఎంత ఎదిగినా ఇతరులతో వ్యవహరించే తీరు మాత్రం అలాగే ఉంది’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఆదర్శ దంపతులు..
విరాట్.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ(Anushka Sharma )ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 11, 2017లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ఓ కూమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. కుటుంబం కోసం అనుష్క సినిమాలకు దూరమైంది. గోప్యతా దృష్ట్యా పిల్లలను కూడా బయటి ప్రపంచానికి చూపించలేదు. వీరు ప్రస్తుతం లండన్‌లోనే నివాసం ఉంటున్నారు. మరోవైపు కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన విరాట్.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ(74) బాది ఫామ్‌లోకి వచ్చాడు.
ఇవి కూడా చదవండి
భారీ రికార్డుకు చేరువలో బుమ్రా
మహిళా క్రికెట్.. ఐసీసీ కీలక నిర్ణయం
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి