Team India: టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:54 PM
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టుకు కొన్నేళ్ళ నుంచి గాయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు నెలల తరబడి ఆటకు దూరమయ్యే పరిస్థితి వస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత క్రికెటర్లు మరీ సున్నితంగా తయారవుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అనూహ్యంగా..
శుభ్‌మన్ గిల్(Shubhman Gill) ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తు్న్నాడు. జట్టులో మూడు ఫార్మాట్లలో ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో అతనొకడు. ఇప్పటి వరకు గిల్‌కు ఫిట్‌నెస్ సమస్యలేవీ లేవు. కానీ ఇటీవల దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో అనూహ్యంగా మెడ నొప్పి బారిన పడ్డాడు. ఫిజియో వచ్చాడు.. చికిత్స అందించాడు.. బ్యాటింగ్ చేస్తాడులే అనుకుంటే.. నొప్పి తీవ్రతరమైంది. రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. రెండో టెస్టు సమయానికి కోలుకుని తిరిగొస్తాడని అనుకుంటే.. ఈ మ్యాచ్‌కే కాదు, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. రెండు మూడు వారాల వరకు కోలుకునే పరిస్థితి లేదు అంటే.. సమస్య తీవ్రమైనదే అని అర్థమవుతోంది. ఓ యువ క్రికెటర్‌కు ఇలాంటి ఇబ్బంది తలెత్తడం అరుదైన విషయం.
అదో వింత కథ..
వన్డేల్లో జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar)ది ఇంకో వింత కథ. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా సిడ్నీలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. డైవ్ క్యాచ్ అందుకోబోయి కింత పడే క్రమంలో కడుపు లోపల గాయమైంది. ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సినంత పెద్ద సమస్య అది. తన ప్రాణాలకే ముప్పు తెచ్చే గాయం అంటూ వార్తలు కూడా వచ్చాయి. శ్రేయస్ పూర్తిగా గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించడానికి మూడు నెలల సమయం పడుతుందని సమాచారం.
బుమ్రాకు మామూలే..
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా(Bumrah) చాలా ఏళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆటలోకి పునరాగమనం చేయడం.. మళ్లీ ఇబ్బంది పడటం.. మామూలైపోయింది. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ చివర్లో గాయపడి నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు. మరో సీనియర్ పేసర్ షమీ(Shami).. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఏడాది తర్వాత మైదానానికి దూరంగా ఉన్నాడు. వయసు పెరిగింది.. ఫామ్‌లో కూడా లేడని సెలక్షన్‌కు పరిగణనలోకి తీసుకోట్లేరని తెలుస్తోంది.
మరోవైపు రిషభ్ పంత్(Rishabh Pant).. రోడ్డు ప్రమాదం వల్ల ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్నాడు. గతేడాది పునరాగమనం చేసి.. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఆల్‌రౌండర్ హార్దిక పాండ్య(Hardik Pandya) సైతం గాయంతో ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. అప్పటితో పోలిస్తే క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య బాగా పెరిగిపోయిన మాట వాస్తవం. పోటీ, ఒత్తిడి పెరిగిపోయింది. ప్రయాణాలు ఎక్కువయ్యాయి. కానీ ఈ తరం ఆటగాళ్ల లాగే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ, ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్న ధోని, కోహ్లి, రోహిత్.. ఉత్తమ ఫిట్‌నెస్‌తో సాగారు. వారితో పోలిస్తే ఇప్పటి ఆటగాళ్లు సున్నితంగా తయారయ్యారన్నది స్పష్టం.
ఇవి కూడా చదవండి:
ఆ పోస్టులు డిలీట్ చేసిన స్మృతి!