Smriti Mandhana: ఆ పోస్టులు డిలీట్ చేసిన స్మృతి!
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:13 PM
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇన్‌స్టా పోస్టులో పెళ్లికి సంబంధించిన పోస్టులు కనిపించకపోవడం చర్చకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలు జరుగుతుండగా.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురవడంతో వివాహ సంబరాలను నిలిపేశారు. అయితే తాజాగా ఆమె(Smriti Mandhana) ఇన్‌స్టాలో పెళ్లికి సంబంధించిన పోస్టులు కనిపించకపోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
డిలీట్ చేసిందా? హైడ్ చేసిందా?
ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్(Palash Muchhal )తో ఎంగేజ్‌మెంట్ అయినట్లు అధికారికంగా వెల్లడిస్తూ ఇటీవల స్మృతి తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. సహచర క్రికెటర్లతో కలిసి బాలీవుడ్ పాటకు స్మృతి డ్యాన్స్ కూడా చేసింది. ఈ సందర్భంగా తన వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉందంటూ చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆమె ఇన్‌స్టాలో కనిపించకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే వీడియోను స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేయడం గమనార్హం.
అయితే ఈ వీడియోను ఆమె డిలీట్ చేసిందా? హైడ్ చేసిందా? అన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు పలాశ్ ముచ్చల్ ఇన్‌స్టా ఖాతాలో ప్రపోజల్ వీడియో మాత్రం అలాగే ఉంది. భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి వేలికి ఉంగరం తొడుగుతూ పలాశ్ పెళ్లి ప్రతిపాదన చేసిన వీడియో అది.
వాస్తవానికి స్మృతి-పలాశ్ వివాహం నవంబరు 23 బెంగళూరు వేదికగా జరగాల్సి ఉంది. అయితే, అకస్మాత్తుగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే పెళ్లిని వాయిదా వేయాలని స్మృతి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మేనేజర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. పలాశ్ కూడా ఈ ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో బాధపడటంతో ఆసుపత్రిలో చేరిన అతడు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. వీరిద్దరూ 2019 నుంచి రిలేషన్‌లో ఉండగా.. గతేడాది వీరి ప్రేమ గురించి బయటపడింది.
ఇవి కూడా చదవండి:
ఆ స్థానంలో ఆడించాలి: ఇర్ఫాన్ పఠాన్