Irfan Pathan: ఆ స్థానంలో ఆడించాలి: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Nov 24 , 2025 | 02:49 PM
సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ హీరో తిలక్ వర్మను నాలుగో స్థానంలో ఆడించాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 30 నుంచి టీమిండియా-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దీనికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మెడ గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న యువ బ్యాటర్ తిలక్ వర్మపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘తిలక్ వర్మ(Tilak Varma) వన్డేల్లోనూ అద్భుతంగా రాణించగలడు. అతడు ఆసియా కప్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో అతడు నంబర్ 3 స్థానంలో చక్కగా రాణించగలడు. కానీ తిలక్ వర్మ వన్డేల్లో నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడు. అతడు మొదట క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు చేస్తాడు. అలాగే స్లాగ్ స్వీప్ అద్భుతంగా ఆడగలడు. ఇంకా వికెట్ల మధ్య కూడా చక్కగా పరుగులు తీయగలడు’ అని ఇర్ఫాన్ విశ్లేషించాడు. తిలక్ వర్మ.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా దాదాపు సంవత్సరం తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే జట్టులో స్థానం కోల్పోయిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియాకప్ (Asia Cup) హీరో తిలక్ వర్మను (Tilak Varma) సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు.
భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
Mohsin Naqvi: పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీని అందజేసిన నఖ్వీ