Share News

Virat Kohli: విరాట్ లేని లోటు తెలుస్తోందా?

ABN , Publish Date - Nov 24 , 2025 | 02:18 PM

సొంతగడ్డపై టీమిండియా వరుస పరాభవాలు చవి చూస్తుంది. న్యూజిలాండ్‌తో క్లీన్ స్వీప్.. కోల్‌కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ రికార్డుల గురించి నెట్టింట చర్చ మొదలైంది.

Virat Kohli: విరాట్ లేని లోటు తెలుస్తోందా?
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర పరాభవం.. రెండో టెస్టులో గెలవడం అటుంచితే.. డ్రా అయినా చేస్తారా? అనే సందేహం. గువాహటిలో తొలి రోజు ఆట చూశాక.. ఈ టెస్టు మనదే! అనిపించింది. అదే ఆశతో ప్రారంభమైన రెండో రోజు ఆట పూర్తిగా నిరాశతో ముగిసింది. మూడో రోజైనా టీమిండియా బ్యాటర్లు పుంజుకుంటారునుకున్నాం. కానీ కళ్లు మూసి తెరిచే లోపే 174 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. సీనియర్లు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా.. పూర్తిగా విఫలమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావన వచ్చింది.


అజేయమైన కెప్టెన్..

భారత టెస్టు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్.. పరుగుల వీరుడు.. విరాట్ కోహ్లీ(Virat Kohli). సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రాతను మార్చిన కెప్టెన్ అయితే.. టీమిండియాను ఇంకా అత్యున్నత స్థాయికి చేర్చిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అయితే టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలందించి, తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత మాత్రం విరాట్‌కే చెందుతుంది. అతడి సారథ్యంలో 68 టెస్టులు ఆడిన టీమిండియా.. 40 విజయాలు సాధించడం విశేషం. ఇంత గొప్ప రికార్డు భారత క్రికెట్‌లో ఇంకెవ్వరికీ లేదు. విరాట్ తన సారథ్యంలోనే వన్డే, టీ20 జట్లను కూడా బాగానే నడిపించినప్పటికీ.. టెస్టుల్లో తన ఘనతలు అసామాన్యం. అతను కెప్టెన్ అయ్యాక ఎనిమిదేళ్ల వ్యవధిలో భారత్ సొంతగడ్డపై ఒక్కటంటే ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడలేదు. ఈ కాలంలో టీమిండియా ఓడిన టెస్టులు రెండు మాత్రమే. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న జట్టును.. కోహ్లీ నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చాడు.


ఆ నిర్ణయం వల్లే..

2022లో విరాట్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పించారు. ఆ ఆవేదనతోనే కోహ్లీ టెస్టు సారథ్యాన్ని కూడా వదులుకున్నాడు. దీంతో రోహిత్ టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యాడు. రెండేళ్లు బండి బాగానే నడిచింది. కానీ గతేడాది కథ అడ్డం తిరిగింది. రోహిత్ సారథ్యంలో సొంతగడ్డపై 0-3తో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాభవం ఎదుర్కొంది. ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో స్వదేశంలో భారత్‌కు మరో పరాభవం దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైంది. మధ్యలో బలహీనమైన వెస్టిండీస్‌పై సాధించిన రెండు విజయాలకు విలువే లేదు.


అదే ప్రతికూలం..

ప్రస్తుత బ్యాటర్లు స్పిన్‌ను సమర్థంగా ఆడలేకపోతుండటం ప్రతికూలంగా మారుతోంది. పిచ్‌లను మన స్పిన్నర్లకు ధీటుగా, ఇంకా చెప్పాలంటే వారిని మించి ప్రత్యర్థి బౌలర్లు ఉపయోగించుకుంటున్నారు. ఫలితం.. వరుస పరాభవాలు. కోహ్లీ సారథ్యంలో జట్టు సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు.. అనుకూల పిచ్‌లు తయారు చేసుకుని గెలిచేస్తున్నారంటూ ఆ విజయాల గురించి తేలిగ్గా మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు ఎదురవుతున్న పరాభవాలు చూశాక విరాట్ విజయాల విలువేంటో అందరికీ అర్థం అవుతోందన్నది మాత్రం స్పష్టం.


ఇవీ చదవండి:

అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..

Mohsin Naqvi: పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీని అందజేసిన నఖ్వీ

Updated Date - Nov 24 , 2025 | 02:18 PM