Sujan Mukherjee: ఎలా తయారు చేయాలో నాకు తెలుసు: ముఖర్జీ
ABN , Publish Date - Nov 18 , 2025 | 09:26 AM
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై వస్తున్న విమర్శలపై పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ స్పందించారు. భారత శిబిరం చెప్పినట్లుగానే పిచ్ తయారు చేశానని చెప్పాడు. టెస్టు మ్యాచ్‌లకు పిచ్ ఎలా సిద్ధం చేయాలో తనకు తెలుసని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది.. అది కూడా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక! ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. హెడ్ కోచ్ గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్లే ఈ ఓటమి అని కొందరు అంటుండగా.. మరికొంత మంది పిచ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్.. పూర్తిగా బౌలర్ల పక్షం వైపు మారడంపై క్రికెట్ మాజీల నుంచి అభిమానుల వరకు విమర్శలు గుప్పించారు. ఇన్ని ట్రోల్స్ నడుమ ఎట్టకేలకు పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ(Sujan Mukherjee) స్పందించాడు.
‘ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) మరీ నాసిరకంగా ఏం లేదు. అందరూ పిచ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే టెస్ట్ మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ తయారు చేయాలో నాకు బాగా తెలుసు. నాకు భారత శిబిరం చెప్పినట్లుగానే పిచ్ రూపొందించా. ఇతరుల విమర్శలు, వ్యాఖ్యలను నేను పట్టించుకోను. అందరికీ అన్నీ తెలియవు. నేను నా పనిని పూర్తి అంకితభావంతో చేశా. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తా’ అని ముఖర్జీ వెల్లడించాడు.
అతడిని తప్పు పట్టలేం..
క్యురేటర్ ముఖర్జీకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కూడా మద్దతుగా నిలిచాడు. ‘భారత శిబిరం ఎలాంటి పిచ్‌ను కోరుకుందో అలాంటిదే రూపొందించాం. పిచ్‌పై మ్యాచ్‌కు ముందు నాలుగు రోజులు వాటరింగ్ చేయలేదు. అందుకే అది ఇలా స్పందిస్తుంది. ఈ విషయంలో క్యురేటర్ ముఖర్జీని తప్పు పట్టలేం’ అని గంగూలీ స్పష్టం చేశాడు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కూడా దీనిపై మాట్లాడిన విషయం తెలిసిందే. ‘మా సూచనల మేరకు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను సిద్ధం చేశారు. ఇది బ్యాటర్లకు మరీ అంత కఠినమైన పిచ్ ఏమీ కాదు. ఓపిగ్గా ఆడితే పరుగులు వస్తాయ్’ అని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి