Share News

Ashwin: అది టర్నింగ్ పిచ్ కాదు: అశ్విన్

ABN , Publish Date - Nov 18 , 2025 | 08:44 AM

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది టర్నింగ్ ట్రాక్ అంటే తాను ఒప్పుకోనని వెల్లడించాడు.

Ashwin: అది టర్నింగ్ పిచ్ కాదు: అశ్విన్
Ashwin

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఛేదించలేకపోయారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాకు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin) అండగా నిలిచాడు. దాంతోపాటు పిచ్‌పై కూడా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


‘ఈడెన్ గార్డెన్స్ టర్నింగ్ పిచ్ అంటే నేను ఒప్పుకోను. ఇది టర్నింగ్ ట్రాక్ కాదు డేంజరెస్ పిచ్. సరిగ్గా తయారు చేయకపోవడంతో పిచ్ ఇలా ప్రమాదకరంగా మారింది. ఎవరైనా ఈ పిచ్‌ను టర్నింగ్ ట్రాక్ అంటే మాత్రం నేను ఏ మాత్రం అంగీకరించను. ఇది ఓ ప్లాన్ ప్రకారం తయారు చేయలేదు. వాస్తవానికి ఈడెన్ గార్డెన్స్‌లో టర్నింగ్ పిచ్‌ను సిద్ధం చేయడమే కష్టం. టర్నింగ్ ట్రాక్ కోసం ప్రయత్నిస్తే ఇలానే పేలవమైన ఆటకు ఉదాహరణగా మారుతుంది. ఈ పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ టర్న్ అవుతుంది’ అని అశ్విన్ తెలిపాడు.


పుంజుకుంటారు..

‘ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma) మినహా వేరే ఎవ్వరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఇది పేలవమైన పిచ్ అనడానికి ఇదే నిదర్శనం. మరోవైపు టీమిండియాలో అందరూ యువకులే. వారు తమను తాము స్థిరపరుచుకోవడానికి సమయం పడుతుంది. గతంలో కూడా ఇలాంటి పరాజయాలు ఎదురయ్యాయి. 2012లో నేను, విరాట్, పుజారా జట్టులోకి కొత్తగా వచ్చినప్పుడు ఇంగ్లండ్‌తో స్వదేశంలోనే సిరీస్ కోల్పోయాం. ఆ తర్వాతే ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం. కాబట్టి కొంతకాలం విమర్శలను పక్కన పెడదాం. ఈ యువ జట్టు తప్పకుండా పుంజుకుంటుంది’ అని అశ్విన్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

కెప్టెన్‌లకు ఒత్తిడి ఎక్కువ: కేఎల్ రాహుల్

టెస్టు క్రికెట్‌ను నాశనం చేశారు: భజ్జీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 08:44 AM