Share News

IPL 2026: కెప్టెన్‌లకు ఒత్తిడి ఎక్కువ: కేఎల్ రాహుల్

ABN , Publish Date - Nov 18 , 2025 | 07:15 AM

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కెప్టెన్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని కేఎల్ వెల్లడించాడు. సరైన ప్రదర్శన చేయకపోతే యజమానులు బోలెడు ప్రశ్నలు వేస్తారని తెలిపాడు.

IPL 2026: కెప్టెన్‌లకు ఒత్తిడి ఎక్కువ: కేఎల్ రాహుల్
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ టోర్నీపై స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాయకత్వం వహించిన కేఎల్.. ఈ టోర్నీ ఆడటంలో ఉన్న సవాళ్లను వివరించాడు. ఆటపై అవగాహన లేని ఐపీఎల్ యజమానులకు జవాబుదారీగా ఉండాలని తెలిపాడు. ఈ విషయంలో కెప్టెన్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారని వెల్లడించాడు.


‘ఐపీఎల్‌లో కెప్టెన్‌గా నేను(KL Rahul) ఎంతో కష్టపడ్డాను. సారథిగా ఉన్న వ్యక్తి ఎన్నో సమావేశాలు, సమీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. యాజమాన్య స్థాయిలో ఉన్నవారికి వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది. ఐపీఎల్ సీజన్ ముగిసేనాటికి నేను పది నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడటం కంటే మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోయానని గ్రహించాను. కోచ్‌లు, కెప్టెన్‌లను నిరంతరం చాలా ప్రశ్నలు అడుగుతారు. ఆ మార్పు ఎందుకు చేశారు? ఆ వ్యక్తి తుది జట్టులో ఎందుకు ఆడాడు? ప్రత్యర్థి జట్టు 200 పరుగులు చేస్తే మనం కనీసం 120 రన్స్ ఎందుకు చేయలేదు? ఆ జట్టు బౌలర్లు ఎక్కువ స్పిన్ ఎలా వేయగలుగుతున్నారు?... ఇలా బోలెడు ప్రశ్నలు అడుగుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న కోచ్‌లకు ఏం జరుగుతుందో తెలుసు. ఆట గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి ఎందుకు విఫలమయ్యామని చెప్తే వారు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు అన్ని విభాగాల్లో రాణించినా.. మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి క్రీడేతర నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులకు వివరించడం చాలా కష్టం’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.


లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్‌.. 2022-2024 మధ్య కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తొలి రెండు సీజన్లలో జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరగా.. 2024లో ఏడో స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిపోయిన తర్వాత కేఎల్‌ రాహుల్‌తో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్‌గా మాట్లాడాడు. రాహుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా గోయెంకా తన వాదన కొనసాగించాడు. అప్పట్లో ఈ వీడియోలు వైరలయ్యాయి. తర్వాత రాహుల్ మెగా వేలంలో పాల్గొనగా ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.


ఇవి కూడా చదవండి:

అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ

ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 07:15 AM