IND vs AUS: నేడే భారత్-ఆసీస్ సెమీస్ ఫైట్.. ఈ ఆరుగురి ఆట అస్సలు మిస్సవ్వొద్దు
ABN , Publish Date - Mar 04 , 2025 | 11:54 AM
Champions Trophy Semies 2025: బరిలోకి దిగితే ప్రత్యర్థి బెండు తీసేంత వరకు వదలని రెండు ప్రమాదకర జట్ల మధ్య భీకర పోరాటానికి సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.

చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిదశకు చేరుకుంది. గ్రూప్ మ్యాచులు ముగియడంతో ఇప్పుడు అంతా నాకౌట్ మ్యాచులపై ఫోకస్ పెడుతున్నారు. తొలి సెమీఫైనల్‌లో భాగంగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా తాడోపేడో తేల్చుకోనున్నాయి. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్ రెండు జట్లకు డిసైడర్‌గా మారింది. గెలిచిన టీమ్ ఫైనల్స్‌లోకి అడుగుపెడితే.. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. అందుకే ఎలాగైనా నెగ్గి తీరాలని అటు స్మిత్ సేన, ఇటు రోహిత్ సేన రెండూ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో పక్కా గమనించాల్సిన ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
విరాట్ కోహ్లీ
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూకుడు మీద ఉన్నాడు. గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతూ వచ్చిన కింగ్.. చాంపియన్స్ ట్రోఫీతో టచ్‌లోకి వచ్చాడు. దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. న్యూజిలాండ్ మీద కూడా భారీ స్కోరు వచ్చేదే. కానీ గ్లెన్ ఫిలిప్స్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. తనకు ఇష్టమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో మ్యాచ్ కావడం, అందునా ఐసీసీ టోర్నమెంట్ అవడం, బిగ్ మ్యాచెస్‌లో ప్రెజర్‌ను తట్టుకొని బెస్ట్ ఇచ్చే అనుభవం ఉండటంతో కంగారూలను భారీ స్కోరు బాది కంగారు పెట్టాలని విరాట్ భావిస్తున్నాడు. కాబట్టి ఇవాళ అతడి బ్యాటింగ్ చూసితీరాల్సిందే.
రోహిత్ శర్మ
భారత సారథి రోహిత్ శర్మ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు ధనాధన్ స్టార్ట్స్ ఇస్తున్నాడు హిట్‌మ్యాన్. అతడు పట్టుదలతో క్రీజులో నిలబడితే ఎలాంటి పిచ్ మీదైనా అలవోకగా సెంచరీ కొట్టేస్తాడు. సెమీస్ మ్యాచ్ కావడంతో రోహిత్ మరింత నిబద్ధతతో ఆడాల్సి ఉంటుంది. టీమ్ గెలుపును అతడి బ్యాటింగ్, ఓపెనింగ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి హిట్‌మ్యాన్ ఎలా ఆడతాడనేది కీలకం. అతడు గానీ క్రీజులో నిలబడితే స్మిత్ సేనకు చుక్కలే.
వరుణ్ చక్రవర్తి
పోయిన చోటే వెతుక్కుంటున్నాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. టీ20 వరల్డ్ కప్-2021 భారత్ పరాభవంతో వరుణ్ బలయ్యాడు. అప్పుడు టీమ్‌కు దూరమైనోడు ఇటీవలే మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చి అదరగొడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 లీగ్ మ్యాచ్‌లో కివీస్‌పై 5 వికెట్లతో రచ్చ రచ్చ చేశాడు. ఫుల్ స్వింగ్‌లో ఉన్న అతడు అదే ఊపులో కంగారూలను మడతబెట్టేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
శ్రేయస్ అయ్యర్
ప్రస్తుత వన్డే క్రికెట్‌లో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్ పేరే చెబుతారు. అతడి ఫామ్ ఆ రేంజ్‌లో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా స్టన్నింగ్ నాక్స్‌తో చెలరేగుతున్నాడీ స్టైలిష్ బ్యాటర్. ఆసీస్ మీదా అదే ఊపును కొనసాగిస్తే టీమిండియా ఫైనల్ బెర్త్ కన్ఫర్మే.
జోష్ ఇంగ్లిస్
ఇవాళ్టి సెమీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఇంగ్లిస్ కూడా తప్పక చూడాల్సిన ప్లేయర్. విధ్వంసక ఆరంభాలతో ప్రత్యర్థుల నుంచి అతడు మ్యాచులు లాగేసుకుంటున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అతడు కొట్టిన మెరుపు శతకం అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అతడ్ని ఆపకపోతే భారత్‌కు మరింత డేంజర్.
ట్రావిస్ హెడ్
కంగారూ స్టార్ ఓపెనర్ హెడ్‌కు భారత్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు.. హెడ్ చెలరేగిపోతాడు. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో రోహిత్ సేన నుంచి అతడు మ్యాచ్‌ను లాక్కున్నాడు. కాబట్టి ఈ పించ్ హిట్టర్‌ను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపాలి.
ఆడమ్ జంపా
ఆసీస్ జట్టులో జంపా క్వాలిటీ బౌలర్. మంచి అనుభవం ఉన్న జంపా లెగ్ స్పిన్‌తో జాగ్రత్తగా ఉండాలి. విరాట్ కోహ్లీని గతంలో అతడు చాలా ఇబ్బంది పెట్టాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న దుబాయ్ పిచ్ మీద ఈ స్పిన్నర్ చెలరేగితే ఆట స్వరూపమే మారిపోతుంది.
ఇవీ చదవండి:
‘లారెస్’ అవార్డుకు పంత్ నామినేట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి