Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Apr 25 , 2025 | 07:53 AM
Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరాలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు..

Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులు ఎన్‌కౌంటర్ కు దారి తీశాయి. కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సమయంలోనే ఆ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైనికులు అంతే ధీటుగా ప్రతీకార చర్యకు దిగారు. ఇరువర్గాల నడుమ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.
పహల్గాం దాడి సూత్రధారుల ఇంట్లోపేలుళ్లు..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. బిజ్‌బెహరా, త్రాల్ ప్రాంతాల్లో సైనికులు కూంబింగ్ నిర్వహించారు. బైసరన్ నరమేధంలో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తున్న ఉగ్రవాదుల జాడను కనుగొనేందుకు సోదాలు చేపట్టారు. కానీ, ఈ విషయం తమకు ముందే తెలుసన్నట్లు ఆర్మీకి రివర్స్ స్కెచ్ వేశారు టెర్రరిస్టులు. వారి ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లిన సైనికులను బాంబుల ఉచ్చులో దింపేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, అనుమానస్పదంగా అనిపించి ముందే సురక్షిత ప్రాంతానికి చేరుకోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు మన జవాన్లు.
పుల్వామా జిల్లాలోని మోంఘమా ప్రాంతంలోని ఆసిఫ్ ఇంట్లో, బిజ్‌బెహారాలోని అదిల్ థోకర్ అలియాస్ అదిల్ గురి ఇంట్లో బాంబు పేలుళ్లు సంభవించాయి . బైసరన్ లోయ మారణకాండకు వీరే సూత్రధారులని నిఘా వర్గాలు చెబుతున్నాయి. లష్కరే తోయిబా (LeT) స్థానిక కమాండర్ గా ఆసిఫ్ షేక్ పనిచేస్తుండగా.. లష్కరే తోయిబాకే చెందిన ఆదిల్ థోకర్ 2018లో చట్టబద్ధంగా పాకిస్తాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందాడు. గతేడాదే స్వగ్రామానికి తిరిగి వచ్చి దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చాలాకాలం నుంచే ఆదిల్ నిఘా సంస్థల రాడార్‌లో ఉన్నాడని అధికారులు చెబుతున్నారు.
Read Also: Pahalgam: నిఘా వర్గాలు హెచ్చరించినా
Terror Attack: ఖాళీ అవుతున్న కశ్మీరం
Pahalgam Terror Attack: నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడ్డ పాక్