Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..
ABN , Publish Date - Jan 19 , 2025 | 10:39 AM
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో మొత్తానికి నిందితుడు దొరికేశాడు. అతడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తో అతడ్ని పట్టుకున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో ఎట్టకేలకు నిందితుడు దొరికాడు. అతడ్ని థానేలో పట్టుకున్నారు పోలీసులు. నిందితుడి అసలు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని ముంబై డీసీపీ దీక్షిత్ తెలిపారు. విజయ్ దాస్ అనే మారుపేరుతో తిరుగుతున్నాడని.. అతడు ముంబైకి వచ్చి ఐదారు నెలలైందని చెప్పారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి అతడు వెళ్లాడని పేర్కొన్నారు. అతడు హౌజ్ కీపింగ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాడు వీడు కాదు!
సైఫ్ కేసులో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారనే దానికి సంబంధించిన రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అతడ్ని ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నారని.. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అరెస్ట్ చేశారని వినిపిస్తోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయంతో దుర్గ్ అనే ప్రాంతంలో అతడ్ని పట్టుకున్నారట ముంబై పోలీసులు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ అతడికి సైఫ్ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. అతడి పేరు ఆకాశ్ కనోజియా అని.. కేసుతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
పొదల్లో నక్కి..!
సైఫ్ కేసులో అసలు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహారాష్ట్రలోని థానేలో పోలీసులకు చిక్కాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా నిందితుడు దొరికిపోయాడు. థానేలోని ఓ ప్రాంతంలో పొదల చాటున దాక్కున్న షరీఫుల్ ఇస్లాంను పోలీసులు పట్టుకున్నారు. థానేలో గతంలో పని చేశాడని.. ఏరియా గురించి బాగా తెలియడంతో సేఫ్ అనే ఉద్దేశంతో అక్కడ దాక్కున్నాడట. అయితే పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి చాకచక్కంగా అతడ్ని పట్టుకున్నారని తెలుస్తోంది. పారిపోయేందుకు వీలు లేకుండా నలువైపుల నుంచి బ్లాక్ చేసి అరెస్ట్ చేశారని సమాచారం. అనంతరం అక్కడి నుంచి అతడ్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి:
అద్దెకు ఉండే వారికి ఉచిత విద్యుత్తు, నీరు
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డుల విడుదల
ఫుట్‌బాల్ కోసం 30లక్షల వీధి కుక్కల హతం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి