Share News

Droupadi Murmu: ఈ అధికారం మీకెవరు ఇచ్చారు.. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న..

ABN , Publish Date - May 15 , 2025 | 11:47 AM

President Droupadi Murmu On Supreme Court: రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ అభిప్రాయాన్ని కోరారు.

Droupadi Murmu: ఈ అధికారం మీకెవరు ఇచ్చారు.. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న..
President Droupadi Murmu On Supreme Court

President Droupadi Murmu Supreme Court Timelines: రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు, రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం vs గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న రాష్ట్రపతి, గవర్నర్లు గడువులోగా బిల్లులు ఆమోదించాల్సిదేనని అని ఆదేశించింది. అయితే, తాజాగా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయని సుప్రీంను ప్రశ్నిస్తూ 14 ప్రశ్నలను సంధించారు.


ఆ అధికారం రాజ్యాంగబద్ధమేనా..

తమిళనాడు ప్రభుత్వం vs గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని తీర్పు వెలువరించింది. గడువులోగా ఆమోదించడమో, వెనక్కి తిప్పిపంపడమో ఏదొకటి చేయాలని స్పష్టం చేసింది. బిల్లులు ఆమోదించకపోతే ఎందుకనే కారణాలు కచ్చితంగా చెప్పాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా ఇలాగే చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, రాజ్యాంగ అధికరణం 142 ప్రకారం గవర్నర్ల నిష్క్రియాపరత్వాన్ని న్యాయ సమీక్ష చేసేందుకు సంపూర్ణ అధికారం సుప్రీం కోర్టుకు ఉందని జస్టిస్ జేబి పార్దివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం వెల్లడించింది. అయితే, సుప్రీం ఇలా కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందించారు.


సుప్రీంకు 14 ప్రశ్నలు..

రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు ఈ తీర్పు ఎలా ఇవ్వగలరని రాష్ట్రపతి ముర్ము బుధవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద రాష్ట్రపతికి ఉన్న అరుదైన అధికారాలను ఉపయోగించి 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. నూతన సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతి ముర్ము ఈ తీర్పుపై స్పందించడం గమనార్హం.


రాష్ట్రపతి ముర్ము అడిగిన 14 ప్రశ్నలు..

  • ఆర్టికల్ 200 కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి?

  • ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా?

  • ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారం వినియోగించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా?

  • ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ 361 పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా?

  • రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ 200 కింద గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు విధించవచ్చా, విధానాలను సూచించవచ్చా?

  • ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా?

  • ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు కాలపరిమితిని, విధానపరమైన అవసరాలను నిర్ణయించగలవా?


  • గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా?

  • ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్, రాష్ట్రపతి ఆర్టికల్ 200, 201 ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా?

  • ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయవ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా?

  • ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమలులోకి వస్తుందా?

  • సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసుకు గణనీయమైన రాజ్యాంగ వివరణ అవసరమా అని నిర్ణయించి దానిని ఆర్టికల్ 145(3) ప్రకారం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు నివేదించాలా?

  • ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం సబబేనా?

  • ఆర్టికల్ 131 కింద దావా వేయడం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా?


కాగా, రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు గల అధికారాల పరిమితిపై రాష్ట్రపతి ముర్ము సంధించిన ప్రశ్నలకు సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Read Also: Kafi Success Story: యాసిడ్ దాడిలో కళ్లు పోయాయి.. అయినా విజయం సాధించింది..

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం

Astrologer: శరీరంలో 15 ఆత్మలు ఉన్నాయంటే.. నువ్వెలా నమ్మావు తల్లి..

Updated Date - May 15 , 2025 | 12:54 PM