Operation Sindoor NCERT: ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్‌లో ఆపరేషన్ సిందూర్, చంద్రయాన్..!
ABN , Publish Date - Jul 27 , 2025 | 08:34 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను భూస్థాపితం చేసింది భారత సైన్యం. వారి వీరోచిత పోరాటాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు NCERTఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది.

దేశంలోని విద్యార్థులకు దేశభక్తి, జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. ఈ మాడ్యూల్ రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3- 8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం చూపిన ధైర్యసాహసాలతో పాటు ఆదిత్య ఎల్1, చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా 'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)'కు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చనున్నారు.
ఆపరేషన్ సిందూర్ అంశాన్ని పాఠ్యాంశంలో చేర్చాలనే ఆలోచనతో ఉన్నట్లు గతంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రకటించారు. భావిభారత పౌరులైన విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ భావనను పెంపొందించాలనే లక్ష్యంతో తాజాగా ఎన్‌సీఈఆర్‌టీ కీలక ముందడుగు వేసింది. ప్రిలిమినరీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్యార్థుల వరకూ ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక సిలబస్ రూపకల్పనకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో మాడ్యూల్ 8 నుంచి 10 పేజీల వరకూ ఉంటుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ అనుసరించిన వ్యూహాత్మక, సైనిక ప్రతిస్పందన, దౌత్యపరమైన చిక్కులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పాఠ్యాంశాల్లో కవర్ చేస్తారు.
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్‌లో చర్చ
వర్షాకాల సమావేశాల సందర్భంగా వారం రోజుల పాటు పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ పై సోమవారం నుంచి లోక్‌సభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానుంది. ఈ ఆపరేషన్ పై అధికారిక చర్చ జరగాలని ప్రతిపక్షాలు సైతం సెషన్ మొదటి రోజున గట్టిగా డిమాండ్ చేశాయి. మూడు రోజుల పాటు కొనసాగే 16 గంటల చర్చలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రసంగాలు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి