Sleep Disruption: తెల్లవారుజామున 3 - 5 గంటల మధ్య మెళకువ వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 07:20 AM
తెల్లవారుజామున గాఢ నిద్ర పోవాల్సిన సమయంలో మెళకువ వస్తోందంటే అంతర్లీనంగా కొన్ని సమస్యలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో, పరిష్కారాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య తరచూ నిద్ర చెడి మెళకువ వస్తోందంటే అంతర్లీనంగా కొన్ని సమస్యలు ఉండి ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీవగడియారంలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన వంటివి కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.
అనుభవజ్ఞులు చెప్పేదాని ప్రకారం, ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య శరీరం మానసిక ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఎక్కువ. మనసులో మనకు తెలీకుండా పేరుకుపోయిన ఒత్తిడి ఈ సమయంలోనే శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా జీవ గడియారంలో కలిగే మార్పులు నిద్రను చెడగొట్టి మెళకువ వచ్చేలా చేస్తాయి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు స్వల్పంగా తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి తీసుకొచ్చే మార్పులను శరీరం పూర్తి స్థాయిలో అడ్డుకోలేదు. ఫలితంగా గాఢ నిద్ర చెడిపోయి మెళకువ వచ్చేస్తుంది.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించే ముందే మనసుకు సాంత్వన కలిగించే పనులు చేయాలి. ఒత్తిడి తొలగించుకునేందుకు మనసులో ఉన్న ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వాలి. రాత్రి వేళ కాఫీ, ఆల్కహాల్ తీసుకోవడం లేదా మొబైల్ ఫోన్ చూడటం అస్సలు చేయకూడదు. మెడిటేషన్, మజిల్ రిలాక్సేషన్ వంటి వాటితో మనసు తేలికపడుతుంది. ఇక నిద్రకు సంబంధించి ఓ షెడ్యూల్ పాటిస్తే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.
అయితే, ఇలా నిద్ర చెడిపోవడానికి కొన్ని పెద్ద సమస్యలు కూడా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలు తీవ్రం కావడం ఇందుకు ప్రధాన కారణం. హార్మోన్‌ల మధ్య అసమతౌల్యత కూడా ఈ పరిస్థితికి దారి తీస్తుంది. ఇక స్లీప్ యాప్నియా ఉన్న వారికి కూడా తరచూ మెళకువ వస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల లైఫ్ స్టైల్ కచ్చితంగా మెరుగవుతుందని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త
చాయ్‌తో పాటు బిస్కెట్లు తింటారా.. మరి ఈ విషయాల గురించి తెలుసా