Loan App Harassment: డబ్బు చెల్లించినా వదలని లోన్ యాప్.. మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి..
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:12 PM
తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..

Mumbai Loan App Harassment: రెప్పపాటులోనే రుణాలు అందిస్తామని జనాలను ఆకర్షిస్తారు. ఆపై రుణం కట్టినా.. ఆలస్యమైనా వేధింపులకు దిగుతారు. ఒకపక్క అధిక వడ్డీల మోత మోగిస్తూనే.. మరోపక్క రుణగ్రహీతలపై బెదిరింపులకు దిగుతారు. వ్యక్తిగత డేటాను తస్కరించి ఫొటోలను మార్ఫింగ్ చేసి మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తారు. బాధితుడు బయటకు చెప్పుకోలేని పరిస్థితులను సృష్టిస్తారు. లోన్ యాప్ వేధింపులు తాళలేక ఇటీవల బలవన్మరణాలకు పాల్పడినవారు ఎందరో. తాజాగా ముంబయిలోని ఓ మహిళ పట్ల ఓ లోన్ యాప్ దారుణంగా వ్యవహరించింది. డబ్బులు కట్టినా కట్టలేదంటూ.. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను విడుదల చేసి బెదిరింపులకు దిగింది.
లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోగేశ్వరి వెస్ట్‌లోని క్రాంతి నగర్ కు చెందిన 25 ఏళ్ల బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్యాష్ లోన్' అనే మొబైల్ యాప్ ప్రకటన చూసింది. డబ్బు అవసరం ఉండటంతో జూలై 20న, ఆమె యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. తన వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను నమోదు చేసింది. ఆమె కేవలం రూ.2వేల రూపాయలకే దరఖాస్తు చేసుకోగా.. చేతికొచ్చింది మాత్రం రూ.1300. అదీ 6 రోజుల తర్వాత.
అయితే, రుణ వ్యవధి ముగియకముందే రుణ సంస్థ ఉద్యోగిగా ఓ వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వెంటనే డబ్బు తిరిగి ఇవ్వకపోతే తన అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళ యాప్ ద్వారా సందేశ్ కుమార్ అనే వ్యక్తికి రెండుసార్లు రూ.1000 లు పంపింది. కానీ, ఒక గంట తర్వాత యువతి అత్త ఆమెకు ఫోన్ చేసింది. ఆమె న్యూడ్ ఫొటోను గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌లో షేర్ చేసినట్లు తెలియజేసింది. నిమిషాల వ్యవధిలోనే అదే ఫోటోను అదే నంబర్ నుంచి బాధితురాలి స్నేహితులకూ వెళ్లాయి.
ఏం చేయాలో తెలియక ఆ మహిళ తన తండ్రి దగ్గరకు విషయం చెప్పింది. అనంతరం యువతి తండ్రి సహాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి ఫిర్యాదును మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
కొడాలి నానికి బిగ్ షాక్!
మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి