India AI Generative Model : చాట్ జీపీటీ, డీప్‌సీక్‌లాగే ఇండియాకూ సొంత ఏఐ మోడల్.. ఎప్పుడంటే
ABN , Publish Date - Jan 30 , 2025 | 06:27 PM
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఛాట్‌జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో చైనా స్టార్టప్ డీప్‌సీక్ రూపొందించడం అంతటా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఏఐ రేసులో భారత్ కూడా అడుగుపెట్టింది..

ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను శాసించేది ఆర్టిఫియల్ టెక్నాలజీనే అని అందరూ నమ్ముతున్నారు. ముందుగా యూఎస్‌కు చెందిన ఓపెన్ ఏఐ సంస్థ 2023లో ఛాట్‌జీపీటీని పరిచయం చేసి ఏఐ రేసు మొదలుపెట్టింది. ప్రపంచ పెద్దన్నగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికా భావించింది. ఛాట్‌జీపీటీకి పోటీగా ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ పొందుతున్న ఏఐ మోడల్ గూగుల్ జెమిని ఒక్కటే. ఈ తరుణంలోనే చైనాలోని ఓ స్టార్టప్ కంపెనీ ఛాట్‌జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్ డీప్‌సీక్ రూపొందించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏఐ టెక్నాలజీ అభివృద్దికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు పెడుతుంటే చైనా డీప్‌సీక్‌ను కేవలం రూ.51 కోట్లతోనే రూపొందించింది. తాజాగా భారత్ కూడా ఈ జాబితా చేరబోతోంది.
ఏఐ రంగంలో ఆవిష్కరణల అభివృద్ధికి దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. చైనాకు చెందిన డీప్‌సీక్ అడుగుపెట్టనంత వరకూ ఏఐ రంగంలో అమెరికా దేశానిదే హవా. ఇప్పుడు తాజాగా భారత్ కూడా ఈ రేసులో అడుగుపెట్టింది. ప్రపంచ దేశాల ఏఐ మోడల్స్‌కు ధీటుగా త్వరలోనే సొంత జెనరేటివ్ ఏఐ మోడల్ అభివృద్ధికి సన్నాహాలు ప్రారంభించింది.
ఇండియాకు సొంత ఏఐ మోడల్.. వచ్చేది అప్పుడే..
ఓపెన్ ఏఐ, డీప్‌సీక్ మాదిరిగానే ఇండియా కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్ తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఒడిశాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ''6 నుంచి 8 నెలల్లో ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు కనీసం ఆరుగురు నిపుణులైన డెవలపర్లు అవసరం. 4 నుంచి 6 నెలల్లో లాంచ్ చేయాలనేది మా ప్రాథమిక లక్ష్యం.'' అని వెల్లడించారు. భారత్ ఈ ఏడాదిలోగా సొంత ఏఐ మోడల్ తీసుకురాబోతోందనే వార్త తెలిసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.