Share News

MP Jairam Ramesh: ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వీడాలి

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:09 PM

కేంద్ర అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందించారు. పహల్‌గామ్ ఉగ్రదాడి, ట్రంప్ ప్రకటనలు, ఆపరేషన్ సిందూర్, చైనా పాత్రతో సహా వివిధ అంశాలపై పార్లమెంట్ లో 2 నుంచి 3 రోజుల పాటు చర్చ జరగాలని సూచించారు. బీహార్‌లో ఓట్ల రద్దు, పహల్‌గామ్ ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాలను పార్లమెంట్‌లో తాము లేవనెత్తుతామని చెప్పుకొచ్చారు.

MP Jairam Ramesh: ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వీడాలి
Congress MP Jairam Ramesh

ఢిల్లీ: కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) రేపు(ఆదివారం, జులై20) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నది. ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament Monsoon Session) నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ (Congress MP Jairam Ramesh) స్పందించారు. పహల్‌గామ్ ఉగ్రదాడి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు, ఆపరేషన్ సిందూర్, చైనా పాత్రతో సహా వివిధ అంశాలపై పార్లమెంట్‌లో 2 నుంచి 3 రోజుల పాటు చర్చ జరగాలని సూచించారు ఎంపీ జైరాం రమేష్.


బిహార్‌లో ఓట్ల రద్దు, పహల్‌గామ్ ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాలను పార్లమెంట్‌లో తాము లేవనెత్తుతామని ఎంపీ జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. మే 10వ తేదీ నుంచి నేటి వరకు డొనాల్డ్ ట్రంప్ 24 సార్లు పహల్‌గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడారని గుర్తుచేశారు. భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, భారత్ - పాకిస్థాన్ అమెరికాతో వాణిజ్యం కోరుకుంటే యుద్ధం ఆగిపోవాలని ట్రంప్ అన్నారని చెప్పారు. ఇప్పుడు ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ కొత్తగా చెబుతున్నారని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలని కోరారు ఎంపీ జైరాం రమేష్.


కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ప్రత్యేక చర్చను డిమాండ్ చేస్తాయని ఎంపీ జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. తమ ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తారని, నవ్వుతూ, అందరినీ పలకరిస్తారని అన్నారు. అందరూ రెండు గంటల పాటు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని.. ఆపై ఏమీ జరగదని... ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇది రొటీన్‌గా జరుగుతోందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశానికి అరగంట ముందు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం చేసి సహకారం కోరుతారని అన్నారు. ఆ తర్వాత, పార్లమెంటులో వారు కోరుకున్నదే జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 01:18 PM