Pahalgam Attack: పహల్గామ్‌లో పబ్లిక్‌గా కాల్చేస్తుంటే భద్రతా సిబ్బంది ఏమయ్యారు.. కేంద్రం ఏమంటోందంటే..
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:57 PM
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam terror Attack) 26 మంది అమాయకులు అశువులుబాసిన ఘటనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. పట్టపగలు అంత మందిని కాల్చి చంపుతుంటే.. భద్రతా సిబ్బంది ఏమయ్యారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..

జమ్ముకశ్మీర్ అంటేనే ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్ అని అంతా భయపడుతుంటారు. అలాంటిది పహల్గాం ప్రాంతంలో పట్టపగలు అంత మందిని కాల్చి చంపుతుంటే.. భద్రతా సిబ్బంది ఏమయ్యారు..? ఇది సామాన్య జనంతో పాటూ గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షపార్టీలు లేవనెత్తిన ప్రశ్న. దీనికి కేంద్రం ఇచ్చిన సమాధానం ఏంటంటే..
జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu and Kashmir) పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam terror Attack) 26 మంది అమాయకులు అశువులుబాసిన ఘటనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. అయితే ఇదే సమయలో అందరి నుంచి మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఉగ్ర ముప్పు ఎక్కువగా ఉన్న కశ్మీర్ పరిధిలో పట్టపగలు ప్రాణాలు తీస్తుంటే.. భద్రతా సిబ్బంది ఏమయ్యారు.. అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇదే ప్రశ్నను గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షపార్టీలు కూడా లేవనెత్తాయి. దాడి సమయంలో బైసరన్‌లో భద్రతా దళాలు ఎందుకు లేరంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అలాగే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. అయితే ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
సాధారణంగా జూన్‌లో ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra) ముందు బైసరన్ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని (Security) మోహరిస్తారని తెలిపింది. ఆ సమయంలోనే మార్గాన్ని అధికారికంగా తెరుస్తారని చెప్పింది. అమర్‌నాథ్ గుహ మందిరానికి వెళ్లే క్రమంలో బైసరన్ వద్ద యాత్రికులు విశ్రాంతి తీసుకుంటారని తెలిపింది. దీనివల్ల అమర్‌నాథ్ యాత్ర సమయంలోనే దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరిస్తుంటారని క్లారిటీ ఇచ్చింది. కాగా టూర్ ఆపరేటర్లు ఏప్రిల్ 20 నుంచే పర్యాటకులను అక్కడికి తీసుకెళ్లడం ప్రారంభించారని కేంద్రం తెలిపింది. యాత్రికులను తీసుకెళ్లడంపై స్థానిక పరిపాలనా యంత్రాంగానికి సమాచారం ఇవ్వలేదని కూడా చెప్పింది. దీనివల్లే బైసరన్ ప్రాంతంలో భద్రతా దళాలను మోహరించలేదంటూ సమాధానం ఇచ్చింది.
పహల్గాం లోని బైసరం లోయలోకి నడక లేదా గుర్రాల మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు బైసరన్ లోయ మైదాన ప్రాంతం. ఇక్కడ ఎలాంటి దాడులు జరిగినా కాపాడుకోవడానికి అవకాశం ఉండదు. దీనికితోడు ఆ సమయంలో భద్రతా సిబ్బంది కూడా లేకపోవడంతో ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోయ చుట్టుపక్కల దట్టమైన వృక్షాలు ఉండడంతో దాడి అనంతరం వారు పారిపోవడానికి కూడా అనుకూలంగా మారింది.