Pahalgam: నిఘా వర్గాలు హెచ్చరించినా
ABN , Publish Date - Apr 24 , 2025 | 06:09 AM
పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగబోతోందని నిఘా వర్గాలకు ముందుగానే సమాచారం అందినప్పటికీ, భద్రతా సంస్థలు అందిన సమాచారం మేరకు సరిగా స్పందించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడికి సంబంధించి, భద్రతా సంస్థలు త్వరగా స్పందించినప్పటికీ, పర్యాటక ప్రాంతాల్లో మరింత మెరుగైన భద్రతా చర్యలు అవసరం అని వారు సూచిస్తున్నారు.

భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందంటున్న విశ్వసనీయ వర్గాలు
సైనికుల దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు.. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగబోతోందనే సమాచారం మన నిఘా వర్గాలకు కొద్దిరోజుల క్రితమే తెలిసిందా? ‘‘ఒక టెర్రర్ గ్రూప్ స్థానికేతరులపై (కశ్మీర్‌కు వచ్చే పర్యాటకులపై) దాడికి ప్రణాళికలు రచిస్తోంది’’ అంటూ నిఘావర్గాలు అప్రమత్తం చేశాయా? అయినా భద్రతా సంస్థలు పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది చనిపోయారా? అంటే.. విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (పీవోకే) చెందిన ఒక ఉగ్రవాది.. ఈ దాడికి సంబంధించి సూచనప్రాయ వ్యాఖ్యలు చేశాడని, తాము ఆ సమాచారాన్ని అందించినా భద్రతా దళాలు వాటిని పట్టించుకోలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడికి వ్యూహరచన మొత్తం పీవోకే, పాక్‌కు చెందిన అంతర్జాతీయ హ్యాండ్లర్లు చేశారని.. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు రియల్‌టైమ్‌లో ఎప్పుడేం చేయాలో ఆదేశాలు ఇచ్చారని, ఏయే ప్రాంతాల్లో భద్రతా దళాల సంఖ్య తక్కువగా, పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో సమగ్ర సమాచారం అందించారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులకు ఆయుధాల వినియోగంలో సమగ్ర శిక్షణ ఇచ్చారని తెలిపాయి.
వారి హెల్మెట్లపై కెమెరాలున్నాయని.. దాడి ఘటనలను చిత్రీకరించి, సూత్రధారులకు పంపేందుకే వాటిని వినియోగించారని పేర్కొన్నాయి. అయితే, పహల్గాంలో ఉగ్రదాడి విషయంలో భద్రతా సంస్థల వైఫల్యం నిజమేగానీ.. పూర్తిగా విఫలమయ్యాయని చెప్పలేమని కర్ణాటకకు చెందిన రక్షణ రంగ వ్యవహారాల విశ్లేషకుడు గిరీశ్ లింగన్న అభిప్రాయపడ్డారు. దాడికి ముందు ఆ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన విషయం, వారి అనుమానాస్పద కదలికల గురించి నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోందని.. కానీ, ఏ సమయంలో దాడి జరగబోతోంది? ఏ స్థాయిలో జరగబోతోందనే అంశంపై పూర్తి సమాచారం లేనందునే భద్రతా దళాలు సరిగ్గా స్పందించలేకపోయాయని ఆయన వివరించారు. దాడి జరిగిన వెంటనే మాత్రం భద్రతా దళాలు వేగంగా స్పందించాయని, మన దళాల సన్నద్ధత సామర్థ్యాన్ని ఇది సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని.. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో మరింత మెరుగైన రియల్-టైమ్ సర్వైలెన్స్ ఏర్పాట్లు చేయాలని, కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ప్రత్యేకించి కశ్మీర్‌లో పర్యాటక ప్రదేశాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని, అంతర్జాతీయ మద్దతు.. మరీ ముఖ్యంగా అమెరికా మద్దతు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అచ్చం సైనికుల్లా..
పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిపిన ఉగ్రవాదులు సైనికుల యూనిఫారాలు, అమెరికన్ మేడ్ ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిళ్లు, ఏకే-47లు ధరించి వచ్చి.. దాదాపు 70 రౌండ్ల కాల్పులు జరిపినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టిన దర్యాప్తు అధికారులు.. మంగళవారం సాయంత్రానికి 50 నుంచి 70 దాకా యూజ్డ్ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ దాడికి సంబంధించిన దర్యాప్తు బాధ్యతను జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..