Share News

ISRO New Project : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..

ABN , Publish Date - Jan 16 , 2025 | 05:43 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం (జనవరి 16, 2025) తెల్లవారుజామున మరో ఘనత సాధించింది. యూఎస్, రష్యా, చైనా దేశాల తర్వాత అంతరిక్షంలో స్పేడెక్స్‌ (SpaDeX) డాకింగ్‌ ప్రయోగం విజయవంతంగా అమలు చేసిన నాలుగో దేశంగా..

ISRO New Project  : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..
Modi Cabinet Green Signal to India's Manned Space Mission

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో ఘనత. గురువారం (జనవరి 16, 2025) తెల్లవారుజామున తొలిసారి అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసి చారిత్రాత్మక విజయం సాధించింది. యూఎస్, రష్యా, చైనా దేశాల తర్వాత డాకింగ్ ప్రయోగం విజయవంతం చేసిన నాలుగో దేశంగా నిలిచింది. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది ఇస్రో. భారత అంతరిక్ష ప్రయోగాలను మరో మలుపు తిప్పగలిగే సంక్లిష్ట ప్రయోగం సక్సెస్ కావడంతో.. అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు, చంద్రునిపై మానవున్ని పంపేందుకు ఈ సాంకేతికత చాలా అవసరం.


గతేడాది డిసెంబర్ 30న శ్రీహరి కోట లాంచ్ ప్యాడ్ నుంచి PSLVC60 ద్వారా 220 కిలలోల బరువున్న రెండు ఉపగ్రహాలు SDX01(ఛేజర్) SDX02(టార్గెట్)లను నింగిలోకి పంపించింది ఇస్రో. ఒకే రాకెట్‌పై ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్లగానే విడిపోయాయి. వాస్తవానికి డాకింగ్ ప్రక్రియ జనవరి 7న షెడ్యూల్ చేయబడినప్పటికీ అనేక మార్లు వాయిదా పడింది. చివరకు జనవరి 16న అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి..యూఎస్, రష్యా, చైనా దేశాల తర్వాత అంతరిక్షంలోడాకింగ్‌ ప్రయోగం విజయవంతంగా అమలు చేసిన నాలుగో దేశంగా నిలిచి చరిత్ర సృష్టించింది.


ఈ సందర్భంగా, "రాబోయే సంవత్సరాల్లో భారతదేశం చేపట్టబోయే ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రలకు ఇది ఒక ముఖ్యమైన మెట్టు" అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు."భవిష్యత్తులో భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ 4, గగన్‌యాన్ ఆశయాలను సాధించేందుకు స్వదేశీ భారత డాకింగ్ సిస్టం విజయం బాటలు వేసిందని" కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ ఇస్రో బృందాన్ని ప్రశంసించారు.


డాకింగ్ అంటే ఏమిటి?ఎందుకంత ప్రాధాన్యం?

అంతరిక్షంలో వేగంగా సంచరిస్తున్న రెండు ఉపగ్రహాలను మాన్యువల్‌గా లేదా వాటంతట అవే ఒకే కక్ష్యలోకి తీసుకురావడాన్ని 'డాకింగ్ ప్రక్రియ' అంటారు. ఉదాహరణకు అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు భారీ మాడ్యుల్స్ భూమి నుంచి పంపడం సాధ్యం కాదు. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే భారీ అంతరిక్ష నౌకలు అవసరమయ్యే మిషన్లను నిర్వహించడం సులభమవుతుంది. స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటుకే కాక ప్రత్యేక మాడ్యూల్స్ అంతరిక్షంలో కలిపేందుకు, సిబ్బందిని, సామాగ్రిని తీసుకెళ్లడానికి కూడా ఈ సామర్థ్యం అవసరం.


డాకింగ్ ప్రయోగం విజయవంతం చేసిన దేశాలు..

యునైటెడ్ స్టేట్స్: 1966లో నాసా ప్రయోగించిన జెమినీ VIII లక్ష్యవాహక నౌక అజేనాతో డాకింగ్ చేసిన మొదటి అంతరిక్ష నౌకగా నిలిచింది. ఈ మిషన్ 1969లో చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి మానవుడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నేతృత్వంలో జరిగింది.

సోవియట్ యూనియన్: 1967లో సోవియట్ యూనియన్ మానవరహిత కాస్మస్ 186, కాస్మస్ 188లను ఆటోమేటెడ్ విధానంలో విజయవంతంగా ప్రయోగించింది.

చైనా: 2011లో మానవరహిత షెంజౌ 8 వ్యోమనౌకను టియాంగాంగ్ 1 అంతరిక్ష ప్రయోగశాలతో విజయవంతంగా డాక్ చేసి చైనా తన డాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఒక సంవత్సరం తర్వాత చైనా వ్యోమగాములు మాన్యువల్‌గా షెన్‌జౌ 9 వ్యోమనౌకను అదే అంతరిక్ష ప్రయోగశాలతో డాక్ చేశారు.


భారతదేశం స్పేడెక్స్‌ డాకింగ్ మిషన్‌ను ఎందుకు నిర్వహించింది?

2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 2040 నాటికి మానవులను చంద్రునిపైకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అవసరమయ్యే సాంకేతికతలు సమకూర్చుకోవడంలో భాగంగా ఈ స్పేడెక్స్‌ డాకింగ్ ప్రయోగం చేపట్టి విజయవంతంగా పూర్తిచేసింది. హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌తో పాటు 30 టన్నుల బరువును భూమి సమీప కక్ష్యకు మోసుకెళ్లాలంటే డాకింగ్ సామర్థ్యం అవసరం. భారతీయ అంతరిక్ష్ స్టేషన్ నిర్మించేందుకు 5 రకాల మాడ్యూళ్లను అంతరిక్షంలోకి పంపాలని భావిస్తోంది. ఇందులో మొదటిదైన రోబోటిక్ మాడ్యూల్ 2028లో లాంచ్ చేయనుంది. చంద్రయాన్ 4 ప్రయోగం ద్వారా చంద్రునిపై నుంచి నమూనాలు సేకరించాలని భావిస్తోంది ఇస్రో. ఇందుకోసం రెండు వేర్వేరు ప్రయోగాల ద్వారా ఐదు కీలక మాడ్యూళ్లను కక్ష్యలోకి పంపాలని ప్రణాళికలు రచిస్తోంది.


మొదటి ప్రయోగంలో నాలుగు మాడ్యూళ్లను పంపిస్తారు. ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి కక్ష్య నుండి చంద్రుని కక్ష్యకు అంతరిక్ష నౌకను మోసుకువెళుతుంది, అక్కడ నుంచి ల్యాండర్, అసెండర్ మాడ్యూళ్లు చంద్రుని ఉపరితలంపైకి వెళ్లి నమూనాలను సేకరిస్తాయి. ఆ నమూనాలను తీసుకెళ్లి అసెండర్ మాడ్యూల్ చంద్రుని కక్ష్యలోని ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్‌కు డాక్ చేస్తుంది. తర్వాత ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్‌ ఆ నమూనాలను భూమి కక్ష్యకు తీసుకొస్తుంది. అక్కడ రీ-ఎంట్రీ మాడ్యూల్‌తో డాక్ అయ్యి విడిగా లాంచ్ అవుతుంది. భూ వాతావరణంలోని వేడిని తట్టుకునేలా ఈ మాడ్యూల్‌ను రూపొందించనున్నారు. ఈ మిషన్‌కు సన్నాహకంగా, చంద్రయాన్-3 మిషన్ ముగింపు సమయంలో ఇస్రో "హాప్ ప్రయోగం" చేసింది


భారతీయ డాకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి?

కొన్నేళ్లుగా స్పేస్ ఏజెన్సీలు కొన్ని ఇంటర్‌ఆపరేబిలిటీలతో కలిపి అనేక రకాల డాకింగ్ మెకానిజమ్‌లు ఉపయోగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డాకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ (IDSS)ని అనుసరించి వ్యోమనౌకలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళతాయి. ఇది మొదట 2010లో బేస్‌లైన్ చేయబడింది. భారతదేశం ఉపయోగించే డాకింగ్ మెకానిజం ఆండ్రోజినస్ - అంటే ఛేజర్, టార్గెట్ శాటిలైట్‌లలోని సిస్టమ్‌లు ఒకేలా ఉంటాయి. ఇది ఇతర ఏజెన్సీలు ఉపయోగించే IDSS మాదిరిగానే ఉంటుంది. అయితే IDSSలో 24 ఉపయోగిస్తే, ఇక్కడ రెండు మోటార్‌లనే వాడతారు. ఈ మిషన్‌లో రెండు ఉపగ్రహాలను దగ్గరకు తీసుకువచ్చి కలిపేందుకు లేజర్ రేంజ్ ఫైండర్, రెండెజ్‌వూస్ సెన్సార్, ప్రాక్సిమిటీ, డాకింగ్ సెన్సార్ వంటి అనేక కొత్త సెన్సార్‌లను ఉపయోగించారు.

Updated Date - Feb 28 , 2025 | 06:38 PM