PM Modi AI video: ప్రధాని మోదీ ఏఐ చాయ్ వీడియో.. మండిపడుతున్న బీజేపీ నేతలు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:48 PM
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ఏఐ వీడియోల పరంపర కొనసాగుతోంది. గతంలో ఆయన్ను కించపరుస్తూ పలు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చాయ్ అమ్ముతున్నట్లు ఉన్న ఏఐ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలం ఏఐ వీడియోలు ఎక్కువయ్యాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖలకు సంబంధించిన ఏఐ వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందాన వంటి వారి ఏఐ, మార్ఫింగ్ వీడియోలు నెట్టింట రచ్చ చేశాయి. కొన్ని రోజుల క్రితం బిహార్ కు చెందిన ప్రముఖ గాయని, ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్, ప్రధాని మోదీ(PM Modi AI video)కి సంబంధించిన ఓ అభ్యంతరకర ఏఐ వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా ప్రధాని మోదీపై మరో వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. ఆయన చాయ్ అమ్ముతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. నెట్టింట్ వైరల్ అవుతున్న ఈ వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ (Congress) నాయకురాలు రాగిణి నాయక్ ప్రధాని మోదీ (PM Modi)ని ఉద్దేశించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రధాని మోదీ చాయ్ వాలా (Chaiwala) అంటూ ఆమె ఏఐ జనరేటెడ్ వీడియోను (AI Video) పోస్ట్ చేశారు. అందులో ప్రధాని మోదీ ఓ చేతిలో టీ కెటిల్, మరో చేతిలో టీ కప్స్ పట్టుకుని చాయ్ విక్రయిస్తున్నట్లు ఉంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వీడియోలో 'చాయ్ బోలో... చాయ్యే (ఎవరికైనా టీ కావాలా?)' అంటూ మోదీ(Modi chaiwala video) అరుస్తున్నట్టుగా గొంతు వినిపిస్తోంది. ఈ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. విపక్షాలు ప్రధాని మోదీని అవమానించాయని, ఇది సిగ్గుచేటు చర్యగా అభివర్ణించింది. అలానే ప్రధాని ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇలాంటి కార్యక్రమాలను పనిగట్టుకుని మరీ చేస్తుందని కమలనాథులు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...