Share News

Monsoon Travel: హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:14 PM

నేచర్ లవర్స్ స్వర్గధామం.. కుంటాల వాటర్‌ఫాల్స్.. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల జలపాత సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Monsoon Travel: హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.
Kuntala Waterfalls Telangana

ఆదిలాబాద్, కుంటాల: వానాకాలంలో ఎక్కడెక్కడి కుంటలు, వాగులు, నదులు ఇలా అన్నీ జలకళ సంతరించుకుంటాయి. ఇక అంతెత్తున ఉన్న కొండలపై నుంచి దూకుతూ పరవళ్లు తొక్కే జలపాతాల అందాలు వర్ణించడానకి మాటలు సరిపోవు. ఈ సీజన్లో తెలంగాణలో ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు అద్భుతమైన గమ్యం ఏదైనా ఉందంటే.. నిస్సందేహంగా కుంటాల జలపాతం పేరు చెప్పొచ్చు. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన వాటర్‌ఫాల్‌గా గుర్తింపు పొందిన కుంటాల ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నదిపై ఏర్పడింది. కుంటాల వాటర్ ఫాల్స్ సౌందర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే వర్షాకాలంలో వెళ్లాల్సిందే. హైదరాబాద్‌కు దగ్గరలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల..

కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా బోక్సా పట్టణం సమీపంలోని కడెం నదిపై ఏర్పడింది. వర్షాకాలంలో147 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాత అందాలను తిలకించేందుకు రెండు కన్నులూ చాలవంటారు పర్యాటక ప్రేమికులు. ఈ వాటర్ ఫాల్స్ చుట్టుపట్ల పచ్చదనం, రాళ్లు ప్రకృతి మలచిన కళాకృతులుగా అగుపిస్తాయి. పగటి వేళల్లో ఇక్కడి సూర్యకాంతి నీటిపై పడితే ఏర్పడే వర్ణాలు కన్నుల పండుగగా ఉంటాయి. ఫోటోగ్రాఫర్లకు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఇది స్వర్గధామమే. అందుకే ఈ సీజన్లో ఎక్కడెక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.


ఆధ్యాత్మికతకు నెలవు

కుంటాల జలపాతానికి సమీపంలో సోమేశ్వరాలయం అనే పురాతన శివాలయం కూడా ఉంది. భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయ దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తారు. శివరాత్రి, కార్తీకమాసం సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ మరింతగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకే కాక, భక్తులకు ఇదో అద్భుత గమ్యం.


హైదరాబాద్‌కు ఎంత దూరం?

కుంటల జలపాతం హైదరాబాద్‌కు సుమారు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజామాబాద్, నిర్మల్ మీదుగా ప్రయాణిస్తే సులభంగా చేరుకోవచ్చు. ఆదిలాబాద్‌ జిల్లాలోని నెరేడి గొండ మండలంలో కుంటాల గ్రామ సమీపంలో ఉంది ఈ జలపాతం. తొగుబోతు తెగ అనే ప్రజలు ఇప్పటికీ అక్కడ జీవిస్తున్నారు. వీరు పర్యాటకులకు మార్గనిర్దేశం చేస్తుంటారు.


ఎప్పుడు వెళ్లాలి? ఎలా వెళ్లాలి?

కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి జులై- అక్టోబర్ ఉత్తమ సమయం. ఈ కాలంలో వర్షాలు విస్తారంగా పడటంతో నీటి ప్రవాహం అత్యంత అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సులు, వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. నిర్మల్ వరకు రైలు లేదా బస్సులో వెళ్లి అక్కడినుండి ట్యాక్సీ ద్వారా కుంటాలకు చేరుకోవచ్చు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. అందుబాటులోకి వాట్సాప్ గ్రీవెన్స్‌

తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 01:03 PM