Extremism Video Games: వీడియో గేమ్స్ చాట్‌లో చీకటి మాటలు.. రిక్రూట్‌మెంట్ కోసం తీవ్రవాదుల ఎత్తుగడ..
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:37 AM
ఆన్‌లైన్ గేమ్స్.. వీడియో గేమ్స్ ఆడే పిల్లలను తల్లిదండ్రులు ఇకపై ఓ కంట కనిపెట్టాల్సిందే. లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే.. డిజిటల్ గేమింగ్ ప్లాట్ ఫామ్స్‌ను రిక్రూట్‌మెంట్ అడ్డాగా మార్చుకుంటున్నాయి తీవ్రవాద బృందాలు. టీనేజర్లే లక్ష్యంగా.. చాట్ పేరిట మాటల గాలం వేసి తమవైపు లాక్కుంటున్నాయని తాజాగా బ్రిటిష్ పరిశోధకులు సంచలన నివేదిక విడుదల చేశారు.

The Dark Side of Gaming: ప్రస్తుతం ఔట్ డోర్ గేమ్స్ కంటే ఆన్‌లైన్ గేమ్స్ లేదా వీడియో గేమ్స్ ఆడేందుకే నేటి తరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గంటల తరబడి స్క్రీన్ ముందు అతుక్కుపోతున్నప్పటికీ.. ఇంట్లో ఆడుకుంటున్నారు కదా అని పేరెంట్స్ పట్టించుకోకపోతే ఇక అంతే సంగతులు అంటున్నారు బ్రిటిష్ పరిశోధకులు. ఎందుకంటే, వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ఇతరులతో చాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిపై నిఘా అతితక్కువగా ఉంటుంది. దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నాయి టెర్రరిస్టు బృందాలు. అమాయక పిల్లలను, టీనేజర్లను తమ వైపు లాక్కునేందుకు గేమింగ్ వరల్డ్ ను పావుగా వాడుకుంటున్నాయి.
టీనేజ్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని వారిని తీవ్రవాదం వైపు మళ్లించడానికి తీవ్రవాదులు లైవ్ స్ట్రీమ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారని బ్రిటిష్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, వివిధ రకాల తీవ్రవాద గ్రూపులు, వ్యక్తులు వీడియో గేమ్‌లు ఆడుతూ చాట్ చేయడానికి, లైవ్ స్ట్రీమ్ చేయడానికి అనుమతించే ప్లాట్‌ఫారమ్‌లను టెర్రరిస్టుల నియామకానికి అడ్డాగా మార్చుకుంటున్నాయి.
ఆవేశపూరితమైన యువతకు మహిళలపై ద్వేషం, యూదు వ్యతిరేకత, జాత్యాంహకార భావనలను, కుట్రపూరితమైన ఆలోచనలను నూరిపోస్తూ తమ వైపు లాక్కుంటున్నాయి. డిస్కార్డ్, స్టీమ్, ట్విచ్ వంటి గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ పై పర్యవేక్షణ తక్కువగా ఉంది. దీంతో ఈ వేదికల ద్వారా చాట్ చేసి యువతతో టెర్రరిస్టులుగా మార్చేందుకు తీవ్రవాద గ్రూపులకు మరింత సులభమవుతోంది.
ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ పోలీసింగ్, ప్రజా రక్షణ పరిశోధన సంస్థలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన డాక్టర్ విలియం ఆల్‌చార్న్, తన సహోద్యోగి డాక్టర్ ఎలిసా ఒరోఫినోతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు 'డిజిటల్ ప్లేగ్రౌండ్‌లు'గా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. నయా నాజీల వంటి టెర్రరిస్టు బృందాలు విద్యార్థుల్లో తీవ్రహింస, కాల్పులకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయని హెచ్చరించారు. ఎడిన్‌బర్గ్ పాఠశాలలో సామూహిక కాల్పులు జరుపుతానని బెదిరించిన 18 ఏళ్ల యువకుడు ఫెలిక్స్ వింటర్ ఉదంతాన్ని ఉదహరించారు. అతడు నాజీ అనుకూల డిస్కార్డ్ గ్రూపుతో 1,000 గంటలకు పైగా చాట్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. కోర్టు 6 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. కాబట్టి, పేరెంట్స్ గేమ్స్ ఆడే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి