Columbia Airport Incident: తన సీటులో మహిళ కూర్చుందని.. రెచ్చిపోయి అందరి ముందూ..
ABN , Publish Date - Aug 02 , 2025 | 10:54 AM
కొలంబియా ఎయిర్‌పోర్టులో ఓ ప్యాసెంజర్ మరో మహిళ చెంప ఛెళ్లుమనిపించాడు. తన సీటులో ఆమె కూర్చుందంటూ రెచ్చిపోయి దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రన్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: కొలంబియాలోని ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సాటి ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించాడు. తన సీటులో ఆమె కూర్చుందని మండిపడుతూ అందరి ముందు చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీడియా కథనాల ప్రకారం, నిందితుడు హెక్టర్ శాంటాక్రజ్, తన భార్యతో కలిసి ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో కూర్చొన్నాడు. ఆ తరువాత అతడు మరో పనిమీద వెళ్లినప్పుడు అతడి సీటులో క్లాడియా సెగూరా అనే మహిళ వచ్చి కూర్చుంది. హెక్టర్ తిరిగొచ్చిన తరువాత క్లాడియాతో వివాదం మొదలైంది. ఆమెను సీటు ఖాళీ చేయమని హెక్టర్ కోరినా ఆమె వినిపించుకోలేదు. ఈ క్రమంలో హెక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు లేవకపోతే లేచేలా నేను చేస్తా అని అన్నాడు. ఈ క్రమంలో ఆమె చేయిని గట్టిగా చరచడంతో మొబల్ ఫోన్ కింద పడిపోయింది. ఆ తరువాత మరింతగా రెచ్చిపోయిన అతడు ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. ఆ సీన్ చూసి చుట్టుపక్కల వారందరూ హడలిపోయారు.
హెక్టర్ మరింత రెచ్చిపోతుండగా కొందరు నిలువరించే ప్రయత్నం చేశారు. అతడిని వెనక్కు నెట్టారు. కొందరు అతడిపై చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. పరిస్థితి అంతకంతకూ ముదురుతుండటంతో హెక్టర్ భార్య జోక్యం చేసుకుని వివాదం సర్దుమణిగేలా చేసింది. ఆ తరువాత పోలీసులు వచ్చి హెక్టర్‌కు బేడీలు వేసి తీసుకెళ్లారు. అతడిపై కేసు పెట్టారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
హెక్టర్ తీరుకు తాను హడలిపోయానని సెగూరా తెలిపింది. ‘నువ్వు లేస్తావా లేదా అని హెచ్చరించాడు. చేయిపై కొట్టడంతో మొబైల్ ఫోన్ చేయి జారి కింద పడిపోయింది. ఆ తరువాత నా ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బకు నా చెవిపోగు కూడా కింద పడింది. నేను హడలిపోయాను’ అని ఆమె తెలిపింది.
కాగా, ఈ ఉదంతం వివాదాస్పదం కావడంతో హెక్టర్ భార్య అందరికీ క్షమాపణలు చెబుతూ నెట్టింట పోస్టు పెట్టింది. తన భర్త చర్యలకు క్షమాపణలు తెలిపింది. ఓ మహిళగా తల్లిగా తనకు ఈ ఘటన ఎంతో మానసిక వేదన కలిగించిందని చెప్పుకొచ్చింది.
ఇవీ చదవండి:
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..
ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్