Kamchatka Volcano Eruption: రష్యాలో భారీ విస్ఫోటనం.. 600 ఏళ్ల తర్వాత నిప్పులు కక్కిన అగ్నిపర్వతం..
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:03 PM
రష్యాలో ఆదివారం మరో మారు భారీ భూకంపం కలకలం రేపింది. ఇటీవల 8.8 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఆ భూప్రకంపనల తీవ్రతకు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ స్థాయిలో బూడిద రంగు పొగ వెలువడుతూ ఆకాశాన్ని కప్పేసింది.

రష్యా: ఇటీవల రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే రష్యాలోని కురిల్ దీవులలో ఆదివారం మరో భూకంపం (Russia Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రత నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ నిర్ధారించాయి. అంతకుముందు, శనివారం అర్ధరాత్రి కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం (Volcano Eruption) బద్ధలైంది. గతవారం ఏర్పడిన భూకంప ప్రకంపన వల్లే 600 ఏళ్ల తర్వాత ఈ విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తోంది.
స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ గ్లోబల్ వాల్కనో ప్రకారం 1550 సంవత్సరం తర్వాత తొలిసారి క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం పేలింది. రష్యన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన వీడియోలో అగ్నిపర్వతం నుంచి భారీ బూడిద మేఘం వెలువడటం గమనించవచ్చు. దీంతో ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ విస్ఫోటనం తర్వాత రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీని కారణంగా అనేక విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
బుధవారం రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్ర తీరప్రాంతాలను రాకాసి అలలు ముంచెత్తాయి. రష్యా నుంచి మొదలుకుని జపాన్, హవాయి, చిలీ ప్రాంతాల వరకూ సునామీ అలలు కుదిపేశాయి. రష్యన్ ఓడరేవు నగరాలు వరదల్లో మునిగిపోయాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చరిత్రలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇది ఒకటిగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ
టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి