Share News

Harish Rao: రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:42 AM

రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. . కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందోనని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్‌రావు.

Harish Rao: రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్
Harish Rao

హైదరాబాద్, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills By Election) ప్రచారంలో భాగంగా మోతీనగర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో వాసవి బృందావనం అపార్ట్‌మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్‌ని గన్నుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంలో కొండా ఫ్యామిలీ, రేవంత్‌రెడ్డి మధ్య వివాదం నడిచిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీయలిస్టులు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడితే కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతులు లైన్‌లో నిల్చుంటున్నారని ఎద్దేవా చేశారు హరీశ్‌రావు.


సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని విమర్శించారు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమి అమ్ముదామంటే ధర లేక నష్టపోతున్నారని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలోని పదేళ్ల పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది నాయకులు పాలించారు కానీ ఎవరూ కూడా కనీస తాగునీరు అందించలేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ రాకముందు హైదరాబాద్‌లో ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లోనే 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ని నిరంతరం పర్యవేక్షించామని పేర్కొన్నారు హరీశ్‌రావు.

HARISH-RAO.jpg


కేసీఆర్ ప్రవేశపెట్టిన షీ టీమ్ అనే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఉద్ఘాటించారు. మహిళలకు భద్రతను పెంచామని తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇది భాగ్యనగరమా లేదా న్యూయార్క్ నగరమా అన్నంతగా ఆశ్చర్యపోయానని వారే చెప్పారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనవచ్చని ఏపీ నేతలు చెబుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఇండస్ట్రీలు క్యూ కట్టి తెలంగాణకు, హైదరాబాద్‌కు వచ్చాయని నొక్కిచెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని ఆరోపించారు హరీశ్‌రావు.


రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30శాతం కమీషన్ సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తమ ఇంట్లో వారిగా ఆదరించారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ని గెలిపించాలని కోరారు. దురదృష్టవశాత్తూ మాగంటి గోపీనాథ్‌ చనిపోయారని... ఆ కుటుంబానికి, వారి పిల్లలకు అండగా బీఆర్ఎస్‌ నిలిచిందని ఉద్ఘాటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ‌గా ఉందని విమర్శించారు. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్‌లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండోవర్ చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారని నిలదీశారు హరీశ్‌రావు.


మాగంటి సునీత ఒక్కరూ కాదని... ఆమె వెంట కేసీఆర్, మొత్తం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని ఉద్ఘాటించారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపుతో తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుందని విమర్శించారు. ఈరోజు ప్రజలందరూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందోనని విమర్శించారు.హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించిందని గుర్తుచేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా..? అని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 10 , 2025 | 06:52 AM