CM Revanth Reddy VS KTR: కేటీఆర్.. నీ చెల్లి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు: సీఎం రేవంత్ సవాల్
ABN , Publish Date - Nov 01 , 2025 | 09:25 PM
మాజీ మంత్రి కేటీఆర్.. తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు చేస్తారు..? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. కేటీఆర్.. తన చెల్లి కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఏ ఆడబిడ్డా పుట్టింటిపై ఆరోపణలు చేయదని.. సొంత చెల్లెలే కేటీఆర్ ను దుర్మార్గుడివని అంటోందని విమర్శించారు. బిల్లా, రంగాలు ఆటోలో తిరుగుతూ జూబ్లీహిల్స్ ప్రజల దగ్గర నాటకాలు ఆడుతున్నారని దెప్పిపొడిచారు సీఎం రేవంత్‌రెడ్డి.
జూబ్లీహిల్స్ ప్రజలను బిల్లా, రంగాలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ (శనివారం) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బోరబండలో కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్‌ను మంత్రిని చేశామని స్పష్టం చేశారు. అజారుద్దీన్‌ను మంత్రిని చేసి జూబ్లీహిల్స్ ప్రజల ముందుకు తాను వచ్చానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కారు.. షెడ్డుకు పోయిందని ఎద్దేవా చేశారు. గతంలో పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా చంద్రబాబు అభ్యర్థిని పెట్టలేదని గుర్తుచేశారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి.. సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యారు. పేదవారిని ఆదుకున్న చరిత్ర పీజేఆర్‌దని నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సెంటిమెంట్‌ను రాజేయాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆక్షేపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బోరబండ బస్తీవాసులకు ఏం చేసిందని ప్రశ్నల వర్షం కురిపించారు. బస్తీ వాసుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఎవరు..? అని నిలదీశారు రేవంత్. తమ ప్రభుత్వంలో పేదలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. బోరబండ బస్తీలో అందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తుచేశారు. గతంలో రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇచ్చారని.. తమ ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ సన్నబియ్యం ఇస్తోందని ఉద్ఘాటించారు. పాలమూరు వాసులు మంచోళ్లు.. అమాయకులు కారని కొనియాడారు. తమను మోసం చేస్తే పాలమూరులో ఏం జరిగిందో చూశారని.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మళ్లీ చూస్తారని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
కేసీఆర్ హయాంలో మహిళలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వంలో కొండా సురేఖ, సీతక్కలకు మంత్రి పదవులు ఇచ్చామని ఉద్ఘాటించారు. బిల్లా, రంగాలు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలంటున్నారని ఫైర్ అయ్యారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు.. నెలకు కనీసం రూ.3వేలు ఆదా అవుతోందని చెప్పుకొచ్చారు. బోరబండ ప్రాంతంలో తాగునీటి సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ బస్తీవాసులకు ఏం చేశారని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు మూడుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ ఒక్కసారి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు పెట్టి.. ఆయన విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రయాణికులకు అలర్ట్.. మెట్రో టైమింగ్స్ సవరణ
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest Telangana News And Telugu News