Share News

భీమవరం/తణుకు SI : ఇద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. కంటతడి పెట్టిస్తున్న ఎస్సై మూర్తి ఆడియో కాల్..

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:28 AM

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్‌ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

భీమవరం/తణుకు SI : ఇద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. కంటతడి పెట్టిస్తున్న ఎస్సై మూర్తి ఆడియో కాల్..
Tanuku Rural SI AGS Murthi last audio call

పోలీస్ స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై ఏజీఎస్ మూర్తి ఉదంతం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా సూసైడ్‌కు ముందు మూర్తి స్నేహితుడితో మాట్లాడిన చివరి ఆడియో కాల్ ఇప్పుడు బయటకు వచ్చింది. ‘వాళ్లిద్దరే నా జీవితాన్ని సర్వనాశనం చేశారురా.. నాకు జీవితంపై ఆసక్తి లేదు.. పిల్లలను, విజ్జిని తలుచుకుంటే బాధేస్తుంది‘అంటూ తీవ్ర ఆవేదనతో ఎస్సై మూర్తి మాట్లాడిన చివరి మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.


ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్లే మనస్తాపానికి గురై ఎస్సై మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తం చేశారు కుటుంబీకులు. అందుకు సాక్ష్యంగా ఇటీవలే ఓ ఆడియో కాల్ బయటపడింది. ఆత్మహత్యకు ముందుకు సహచరుడితో మూర్తి చివరి సంభాషణలోని అంశాలు కుటుంబ సభ్యుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. తప్పుడు కేసులో ఇరికించి 4 నెలలుగా వీఆర్‌లో పెట్టి అవమానించడమే కాకుండా తాజా ఏలూరు రేంజిలో రిపోర్టు చేయమని ఆదేశాలు రావడంతో కలత చెంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు ఈ ఆడియో సంభాషణ ద్వారా తెలుస్తోంది.


  • మూర్తి : స్నేహితుడితో జరిగిన సంభాషణలో "రేంజ్‌కి రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది. డీఐజీ ఇచ్చారు"

  • స్నేహితుడు : ఎప్పుడు?

  • మూర్తి : వాట్సాప్ పెట్టాడు ఇప్పుడే

  • స్నేహితుడు : మరేంటి పరిస్థితి?

  • మూర్తి : ఏం లేదురా ఇంక.. నేనేమి చేయలేను.

  • స్నేహితుడు : వెళ్లాక ఏం అంటారో చూడు.

  • మూర్తి : ఏమన్నా నాకు ఇంట్రెస్ట్ లేదురా.. లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా.. నా వల్ల కాదురా.. నన్ను మోసం చేసిన వాళ్లిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఇక నేను చెప్పేదేం లేదు. నా చేతుల్లో ఏం లేదు. కృష్ణకుమార్, నాగేశ్వరరావు చేసిన పనికి ఈ రోజు వెధవలాగా అయిపోయా.


  • స్నేహితుడు : మళ్లీ ఈ రేంజ్ గొడవ ఏంటి?

  • మూర్తి : నేనైతే వెళ్లలేను. రిపోర్ట్ చేయను. మనసేం బాగోలేదు. ఆ కృష్ణకుమార్‌కు చెప్పాను నన్ను ఇబ్బంది పెట్టద్దు అని. లేదు అదీ ఇదీ అని నాశనం చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావుకి చెప్పినా ఇలానే చేశాడు. ఇద్దరూ కలిసి సర్వనాశనం చేశారు నన్ను. ఫ్యామిలీతో ఎంతో చక్కగా, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఏ రోజుకా రోజే గడుపుకుంటూ వస్తున్నా.

  • స్నేహితుడు : ఇప్పటిదాకా ఉన్నావ్. రాజమండ్రి లేదా లూప్ కావాలని అడుగు. ఏమంటారో చూద్దాం. నెగటివ్‌గా తీసుకోవడం ఎందుకు?

  • మూర్తి : నాకు తెలుసు కదా. అక్కడికి వెళ్లాక ఏం జరిగేది. అంతా ఊహించిందే జరుగుతుంది. పిల్లలు, విజ్జిని చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది రా.. మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నా గానీ..

  • స్నేహితుడు : ఏం మాట్లాడుతున్నావురా.. నీ కొంపలేం మునిగిపోలేదు ఇంకా. ఇన్నాళ్లు వెయిట్ చేశావ్. ఇంకో రెండ్రోజులు వెయిట్ చెయ్. ఏమైంది ఏమని తెలుసుకోకుండా ఎందుకు కంగారుపడతావ్. నెగటివ్ అని తెలిస్తే డెసిషన్ తీసుకున్నా అర్థముంటుంది. రాజమండ్రి వెళ్తా అంటే ఒప్పుకుంటారేమో.

  • మూర్తి : కన్ఫర్మ్ కృష్ణాజిల్లారా. నేనక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను.


  • స్నేహితుడు : నువ్ కంగారు పడకు. పిచ్చిపిచ్చిగా మాట్లడకు. నీకెలా చెప్తే అర్థమవుతుంది. నువ్వు ఒక్కమాట కూడా పాజిటివ్‌గా మాట్లాడటం లేదు. నీకు అన్యాయం జరిగింది కాదనను. నీ మైండ్ సరిగా లేదు. నువ్ చచ్చిపోతే సమస్య పరిష్కారమవుతుందా. ఆ ఇద్దరు ఆఫీసర్లు ఏమైనా రిజైన్ చేస్తారా. తర్వాత ఫ్యామిలీ ఏమవుతుందో..ఎలా బతుకుతుందో నీకేం తెలుస్తుంది. నువ్వు చూసుకున్నట్లు మీ అన్నయ్య వాళ్లు, ఇతరులు చూసుకుంటారా..నువ్విలా చేసుకున్నావని నీ జాబ్ మీ భార్యకిచ్చి ఏమైనా ఆదుకుంటారా..ఎంతమంది వీఆర్‌లో లేరు. లా అండ్ ఆర్డర్ వదిలేయ్. రూ.90 వేలు జీతమొస్తుంది నీకు. అమ్మాయి వెనకాల ఎవ్వరూ లేరు. అది గుర్తుపెట్టుకో. అర్జంట్‌గా ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందేమీ లేదు. సరెండర్ చేశారు వెళ్లి అడుగు. అవసరమైతే నేనూ వస్తా. కృష్ణా జిల్లా అయితే నష్టమేముంది. జిల్లా మారితే మార్పు రావచ్చేమో. ఇవాళా రేపు ఐజీ ఉండరు. 5 నిమిషాల్లో నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కారం కాదు. నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీకి అన్యాయం చేయకు. కాస్త ఆలోచించు.

  • మూర్తి : నేను వెళ్లలేను. నా వల్ల కాదు..

Updated Date - Feb 03 , 2025 | 01:55 PM