Raghurama Krishnam Raju: ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:16 PM
విశాఖపట్నంలో భూముల రీసర్వేలో వస్తున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రీసర్వేలో తమ కమిటీకి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
విశాఖపట్నం, నవంబరు21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భూ సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnam Raju) సూచించారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నం కలెక్టరేట్‌లో సమగ్ర భూ సర్వే అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు రఘురామ.
ఈ సమావేశానికి సభ్యులు కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, శాసన సభ డిప్యూటీ సెక్రటరీ రాజ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగ కమిషనర్ ఆర్. కూర్మనాథ్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, విశాఖ, భీమిలి ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడారు. విశాఖపట్నంలో భూముల రీసర్వేలో ప్రజల నుంచి వస్తున్న ఇబ్బందులపై చర్చించినట్లు తెలిపారు. రీసర్వేలో తమ కమిటీకి స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రీసర్వేలో తమ కమిటీ కొన్ని సూచనలు చేసిందని తెలిపారు. భూ సమస్యలను రీసర్వే ద్వారా పరిష్కరించడానికి ఒక సంవత్సరం గడువు పెంచమని ప్రభుత్వానికి సూచించామని అన్నారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా పారదర్శకమైన రీతిలో రీ-సర్వే జరగాలని రఘురామ రాజు ఆదేశించారు.
రెండు లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం: కూర్మనాథ్
భూముల రీసర్వేను 6,688 గ్రామాల్లో పూర్తి చేశామని ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ ఆర్. కూర్మనాథ్ తెలిపారు. రీసర్వేలో 7 లక్షల ఫిర్యాదులు వచ్చాయని.. 3 లక్షల కేసులు పరిష్కరించలేనివిగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే ప్రజల నుంచి వచ్చిన రెండు లక్షల ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. 7200 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉందని కూర్మనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోస్టుమార్టంలో జాప్యం.. ఆస్పత్రిలోనే మావోల డెడ్‌బాడీస్
అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని
Read Latest AP News And Telugu News