Anam On YSRCP: వైసీపీ నేతల నిందల్ని మోస్తూ సేవాతత్వంతో ముందుకు: మంత్రి ఆనం
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:34 PM
Anam On YSRCP: కేంద్రం జలజీవన్ మిషన్‌కు గతంలో రూ.28 వేల కోట్ల నిధులు ఇచ్చిందని.. కానీ గత ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరించిందని మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో చర్చించి, మరో రెండేళ్ల కాలం పొడిగించేలా చేశారని తెలిపారు.

నెల్లూరు, జులై 16: ఏపీలో సుపరిపాలన తొలి అడుగు పెద్ద ఎత్తున జరుగుతోందని.. సూపర్ సిక్స్ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramnarayana Reddy) అన్నారు. ఈరోజు (బుధవారం) మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మర్రిపాడు మండలంలో రూ.4.62 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఆత్మకూరులో 42 వేల కుటుంబాలను కలిశామని.. మిగిలిన కుటుంబాలను కూడా కలుస్తామని తెలిపారు. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరుకు తాగు, సాగునీరు అందించేందుకు రూ.1800 కోట్లతో హైలెవల్ కెనాల్ తెచ్చామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పనులు నిలిపేయగా, ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభించామన్నారు. హై లెవల్ కెనాల్‌తో లక్ష కుటుంబాలకు సాగునీరు, తాగునీరు అందించవచ్చని మంత్రి వెల్లడించారు.
రూ.549 కోట్లతో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అనుమతులు వచ్చాయన్నారు. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు మెట్ట ప్రాంతాలకు వెలుగొండతో మేలు జరుగుతుందన్నారు. కేంద్రం జలజీవన్ మిషన్‌కు గతంలో రూ.28 వేల కోట్ల నిధులు ఇచ్చిందని.. కానీ గత ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో చర్చించి, మరో రెండేళ్ల కాలం పొడిగించేలా చేశారని తెలిపారు. సోమశిల నీటిని మర్రిపాడు ప్రజలకు అందించి, వారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రూ.10.5 లక్షల కోట్ల భారం ఇచ్చి వెళ్లిందని... ఓ వైపు ఆ అప్పులు తీరుస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. హింద్రీనీవా ప్రాజెక్ట్‌కు రూ.3900 కోట్లు కేటాయించారని.. హింద్రీనీవాను కుప్పం వద్ద కావేరీ నదిలో కలపబోతున్నామని చెప్పారు. వైసీపీ నేతల నిందల్ని మోస్తూ సేవాతత్వంతో ముందుకు సాగుతున్నామన్నారు. రౌడీయిజం, గూండాయిజం, గంజాయి బ్యాచ్‌లు, మాఫియాలు పెట్రేగిపోతున్నాయని... వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా కాలేజీలు, స్కూళ్ల వద్ద తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని... యువత ఉపాధికి గండికొట్టిందని మండిపడ్డారు. ఆత్మకూరులో ఆగస్టు 1న 50 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని తెలిపారు. 1200 నుంచి 1400 మందికి స్పాట్‌లో ఉద్యోగాలు ఇవ్వనున్నారని.. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
కేంద్రమంత్రి మన్సుఖ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే
అవన్నీ జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య: ధూళిపాళ్ల నరేంద్ర
Read Latest AP News And Telugu News