World Snake Day: పా.. పా.. పాము! ప్రమాదకరం కాదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:55 PM
పాము పగబడుతుందా.. మనిషి పగబడతాడా.. నిజమేమిటంటే పాముకు పగబట్టే శక్తి లేదు. మనిషికే ఆ శక్తి ఉంది. పగబట్టి మరీ పాములను చంపేస్తుంటారు. అందుకే... 'పాముకు తలలోనే విషం.. మనిషికి నిలువెల్లా విషమే!' అనే సామెత పుట్టింది.

మనిషి వల్ల పాముకు నష్టమా??
మనిషి వల్ల పాముకే నష్టం పాపం!
పాము (snake) పగబడుతుందా? మనిషి పగబడతాడా?? నిజమేమిటంటే పాముకు పగబట్టే శక్తి లేదు. మనిషికే ఆ శక్తి ఉంది. పగబట్టి మరీ పాములను చంపేస్తుంటారు. అందుకే... 'పాముకు తలలోనే విషం.. మనిషికి నిలువెల్లా విషమే!' అనే సామెత పుట్టింది. ఇంతకీ పామువల్ల మనిషికి ప్రమాదమా?కనిపిస్తే కొట్టి చంపేస్తారు. ఇది తప్పు... పాము - పర్యావరణ సమతుల్యతలో చాలా ప్రాధాన్యంగలది అని చెప్పడానికే ఏటా జూన్ 16న వరల్డ్ స్నేక్ డేని (World Snake Day) జరుపుకుంటారు.
భయం..
పాము కనిపించగానే ముందుగా ఒళ్లంతా పాములా జరజరా భయం పాకుతుంది. అది మీదకి వచ్చి కాటేసేస్తుందేమో అనే ఆందోళన కలుగుతుంది. విషపు కీటకం.. కొట్టి చంపేస్తేనే మేలు అనే అభిప్రాయానికి వస్తారు. కర్రతోనో, రాళ్లతోనో ఇక పాము మీద దాడి చేస్తారు. అది పారిపోయే ప్రయత్నం చేస్తుంది. దెబ్బ తగిలి తప్పించుకుంటే పాము పగబడుతుందనే నమ్మకంతో ఎట్లాగైనా చంపేయాలనే పట్టుదలతో పాము ప్రాణాలు తీసేస్తారు. ఆ తర్వాత మళ్లీ దానికి దహనక్రియలు చేస్తారు. పాలు పోస్తారు. దణ్ణం పెట్టుకుంటారు. దేవతగా ఒకవైపు పూజిస్తూనే కనిపిస్తే మాత్రం పామును కొట్టి చంపేసే విచిత్ర నైజం మనిషిది. మనిషిలోని భయమే పాము ప్రాణాలు తీస్తోంది. నిజానికి కనిపించేవన్నీ విషం కాదు. ఏది విషం, ఏది కాదు అని తెలిస్తే చాలు.. చాలా పాములు పాపం బతికిపోతాయి. ఈ రోజు స్నేక్ డే సందర్భంగా మన ప్రాంతంలో ఉండే పాములూ.. వాటి విశేషాలపై ప్రత్యేక కథనం..
దేశంలో ఉన్న పాముల జాతులు: 300,
విషపూరితమైనవి: 60
శేషాచలంలో 35 రకాల పాములు
అత్యంత విషపూరితం: ఇండియన్ కోబ్రా, నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, గుడ్లపింజరి
శేషులచలం : తిరుమల శేషాచలం కొండల్లో 35 రకాల పాములు ఉన్నాయి. వీటిల్లో కొన్ని అరుదైన జాతులు. అవి.. ఇండియన్ సాండ్ స్నేక్ (ఎర్ర ఇసుకబోతు), నాగార్జునసాగర్ రేసర్ (బోలావతి), శ్రీలంకన్ ప్లయింగ్ స్నేక్(గాలిలో ఎగిరే పసిరిక పాము), సన్నని పడగపు పాము(ఇది అంతరించి పోతోంది). అయితే శేషాచలంలోని సర్పజాతులపై ప్రత్యేకమైన పరిశోధనలు ఏవీ ఇంతదాకా జరగనే లేదు. అందువల్లే ఉన్న 35 రకాల పాములకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేదు.
మాయా సర్పం: పూడుపాము
తరచూ మన ప్రాంతంలో వార్తల్లో ఉండేది పూడుపాము. దీనిని స్మగ్లింగ్ చేస్తూ పట్టుకున్నారు అని చదువుతూ ఉంటాం. విదేశాలకు దీనిని తరలిస్తుంటారని చెబుతారు. ఒక పాము విలువ కోటి దాకా పలుకుతుందని కూడా ప్రచారం. అయితే అసలు ఈ పాము ఎందుకు స్మగుల్ అవుతోంది? దీని వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. దీనికి అతీంద్రియ శక్తులుంటాయనీ, ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం అనీ, ఔషధ విలువలుంటాయనీ.. ఇలా రకరకాల ప్రచారాలున్నాయి. ఇవి నిజమో కాదో కూడా తెలీదు. అయినా ఇవి స్మగుల్ అవుతూ దొరుకుతూనే ఉన్నాయి. రెండు తలలున్నట్టుగా కనిపించే పూడుపాము ఎటువైపునకైనా కదులుతుంది. మన జిల్లాలో చాలా ప్రాంతాల్లో విస్తృతంగా ఇవి కనిపిస్తాయి. చురుగ్గా ఉండదు. మట్టిలో దాగి ఉంటుంది. ఇది విషపు పాము కాదు. అయినా కరిస్తే ఒళ్లంతా వికారంగా మచ్చలు వస్తాయని అంటారు. అందుకే మన ప్రాంతంలో ఎవరిమీదైనా కోపం ఉంటే ‘వాడ్ని పూడుపాము కరవ’ అని శాపనార్థం పెడతారు. మనదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పూడుపాములు ఉంటాయి. ఇరాన్, పాకిస్తాన్‌లలో కూడా కనిపిస్తాయి.
మన సముద్ర జలాల్లో 16 రకాల పాములు
పాములు భూమ్మీద మా త్రమే కాదు సముద్రంలో కూడా ఉంటాయి. తరచూ మత్స్యకారుల వలల్లో పడుతుంటాయి. వీటిని తిరిగి నీళ్లలో వదిలేస్తుంటారు. తిరుపతి జిల్లాలో 16రకాల సముద్రపు పాములున్నాయని అంచనా. వీటిలో చాలా వరకు విషపూరితమైనవిగానే గుర్తించారు. తడ, వాకాడు, కోట సముద్ర తీర ప్రాంతాల్లో ఇవి మత్స్యకారులకు తారసపడుతుంటాయి. వాలుకుర్తిపాము, కస్తూరినాగపాము, హైడ్రోషిప్ పాము, గలంగిరి, వాలగిరి, చంబాబు, నల్లదాసు పాములు ఎక్కువగా మన జిల్లాలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి. అలాగే సముద్ర తీరంలోని ఇసుక ప్రాంతాల్లో ఇండియన్ సాండ్ బోవ(ఎరిక్స్ జోని), కాండనారస్, స్టౌట్ సాండ్ స్నేక్ వంటి పాములు కనిపిస్తుంటాయి.ఇక తిరుపతి జిల్లాలో ఉన్న పులికాట్ సరస్సులో వానపాములు, సేతుపాములు మాత్రమే ఉంటాయి. ఇవి విషపూరితం కాదు. ఇక్కడి వానపాము (ఎర్ర) సైజు చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున వీటిని సేకరించి స్మగుల్ చేస్తుంటారు.
పాములను చంపద్దు.. ప్లీజ్!
నిజానికి పాములు రైతులకు మిత్రులనే చెప్పాలి. రైతులు కష్టపడి పండించిన పంటలను ఎలుకలు, మిడతలు ఇతర కీటకాలు తిని ధ్వంసం చేయకుండా వాటిని ఆహారంగా తీసుకుని పాములు రైతులకు మేలు చేస్తుంటాయి. పంట పొలాల్లో, అడవుల్లో, చెరువుల్లో కనిపించే పాములు అన్నీ విషంగల్లవి కావు. విషసర్పాలు కూడా మనిషి మీదకు రావు. వాటికి మనవల్ల ప్రమాదం అనిపిస్తేనే కాటేస్తాయి. కనిపించగానే భయపడి చంపేయకుండా స్నేక్ రెస్క్యూ టీంకి సమాచారం ఇస్తే పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. చంపేసుకుంటూ పోతే భూమ్మీద పాము అనేదే లేకుండా పోతుంది. ఇందువల్ల సమతుల్యత దెబ్బతింటుంది.
- లక్ష్మీ సౌజన్య, రమణ నాయక్, పాములపై పరిశోధకులు
స్నేక్ ఫ్రెండ్ ఏం చెప్పారంటే..
స్నేక్ ఫ్రెండ్ : మనుషుల నుంచి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా దాదాపు 18వేల పాముల్ని పట్టుకుని భద్రంగా అడవుల్లో వదలిపెట్టిన స్నేక్‌ఫ్రెండ్ ఒకరు తిరుపతిలో ఉన్నారు. తిరుమల కొండమీద, తిరుపతిలోనూ పాము కనిపించిందని సమాచారం అందగానే ప్రత్యక్షమైపోతారాయన. అలవోకగా పట్టి బంధించి దూరంగా విడిచిపెట్టే భాస్కర్‌నాయుడు కూడా రెండు సార్లు పాముకాటుకి గురై ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. అయినా ఈ పనిని శ్రీవేంకటేశ్వరస్వామి తనకు అప్పగించిన బాధ్యతగా భావిస్తారు. 1982లో టీటీడీ అటవీశాఖలో కూలీగా చేరిన ఆయన ఆ తర్వాత స్నేక్ క్యాచర్‌గా మారిపోయారు. ఆయన కోసమే ఒక పోస్టును టీటీడీ ఏర్పాటు చేయడం విశేషం. రిటైరై పదేళ్లయినా ఆయనకు కాంట్రాక్టు పద్ధతిలో అదే పనిని టీటీడీ అప్పగించింది. జీవవైవిధ్య పురస్కారాలు ఎన్నో అందుకున్న 69 ఏళ్ల భాస్కర్‌నాయుడుకి శేషాచలం అడవుల్లో ఉండే అనేక రకాల పాముల గురించిన అవగాహన ఉంది.
ఆత్మరక్షణ కోసం పాము తిరగబడుతుంది
‘‘పాము.. రోడ్డుమీద, పార్కులో లేదా ఇంట్లోకి వచ్చినా భయంతో కేకలు వేస్తూ హడావుడి చేయవద్దు. పాము మీదకి రాళ్లు, చేతికందిన వస్తువులు, మట్టి వంటివి అసలు వేయకూడదు. అలా చేస్తే తనకు ప్రమాదం అని భావించి ఆత్మరక్షణ కోసం పాము తిరగబడుతుంది. కాటేస్తుంది. శబ్దం చేయకుండా దూరం నుంచి దాని కదలికలు గమనించండి. మనుషుల ఉనికి ఉన్నతావులో పాము ఉండదు. పొరపాటున వచ్చినా దూరంగా వెళ్లిపోతుంది. ఒకవేళ అక్కడే ఉండిపోతే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇస్తే చాలు.. నేను వచ్చి దానిని పట్టుకుని దూరంగా తీసుకువెళ్లి విడిచిపెడతాను. ’’
- భాస్కర్ నాయుడు, టీటీడీ స్నేక్‌క్యాచర్
వాలంగిరితోనే ప్రమాదం
సముద్రంలో చేపలు పట్టేందుకు ఎన్నో తరాలుగా మేం వెళ్తూనే ఉన్నాం. వలలో చేపలతో పాటు కొన్ని పాములు కూడా పడుతుంటాయి. వాటిలో వాలంగిరి పాము అత్యంత విషపూరితమైంది. ఈ పాము కరిచి మా పూర్వీకులు చాలామంది మరణించారు. దీనికి మందు దొరకడం అరుదు. మిగతావి కరిచినప్పటికీ అంత ప్రమాదం ఉండదు.
- దక్షాది నటరాజన్, మత్స్యకారుడు, గోవిందపల్లి, కోటమండలం
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!
సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
Read Latest AP News And Telugu News