Irrigation Project Committees: ఇప్పుడు వద్దులే బా!
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:54 PM
వ్యవసాయంలో కీలకమైన సాగునీటి సంఘాల వ్యవస్థ జిల్లాలో నిర్వీర్యమైపోతోంది. గత ప్రభుత్వంలో కమిటీలను నియమించకపోవడం, ఇంజనీర్లకు ప్రత్యేకాధికారుల బాధ్యతలు అప్పగించడంతో వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఒక పద్ధతి, విధానం అంటూ లేకుండా సంఘాల నిర్వహణ జరగడంతో ఆ ప్రభావం కొత్తగా ఎన్నికైన వారిపై పడుతోంది.

సాగునీటి సంఘాల సభ్యుల తీరిది!
ఏడు నెలలైనా బాధ్యతలు తీసుకోని కమిటీలు
వరుసబెట్టి జీఎస్టీ నోటీసులు అందుతుండటమే కారణం
గత కమిటీలు, ఇంజనీర్ల నిర్వాకంతోనే..
వ్యవసాయంలో కీలకమైన సాగునీటి సంఘాల వ్యవస్థ (Irrigation Committees) జిల్లాలో నిర్వీర్యమైపోతోంది. గత ప్రభుత్వంలో కమిటీలను నియమించకపోవడం, ఇంజనీర్లకు ప్రత్యేకాధికారుల బాధ్యతలు అప్పగించడంతో వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఒక పద్ధతి, విధానం అంటూ లేకుండా సంఘాల నిర్వహణ జరగడంతో ఆ ప్రభావం కొత్తగా ఎన్నికైన వారిపై పడుతోంది. గతేడాది డిసెంబరులో సాగునీటి సంఘాలకు ఎన్నికలు పూర్తయినా నేటికీ సగానికిపైగా కొత్త కమిటీలు బాధ్యతలు తీసుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం జీఎస్టీ నోటీసులు అందుతుండటమే. గతంలో చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించినా.. పాత అధ్యక్షులు, ప్రత్యేకాధికారులు జీఎస్టీలు కట్టలేదు. ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించా లంటూ వరుసపెట్టి నోటీసులు అందుతున్నాయి. దీంతో కొత్త కమిటీలు హడలిపోతున్నాయి. ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తాము బాధ్యతలు తీసుకోలేమంటూ తేల్చి చెబుతున్నారు. ఈ కమిటీలన్నీ ఇంకా స్పెషలాఫీసర్ల పాలనలోనే కొనసాగుతున్నాయి.
నెల్లూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 6 ప్రాజెక్టు కమిటీలు, 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 486 డబ్ల్యూఏ (సాగునీటి సంఘాలు) ఉన్నాయి. గడిచిన ఆరేళ్లుగా ఈ కమిటీలు, సాగునీటి సంఘాలకు ఎన్నికలు లేవు. వైసీపీ అధికారంలోకి రాగానే 2019లో అప్పటివరకూ ఉన్న సాగునీటి సంఘాల కమిటీలను రద్దు చేసింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. ప్రాజెక్టు కమిటీలకు ఇరిగేషన్ ఎస్‌ఈలను, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఈఈలను, డబ్ల్యూఏలకు ఆయా డీఈఈలను స్పెషలాఫీసర్లుగా నియమించింది. వీరి ఆధ్వర్యంలోనే ఐదేళ్లపాటు నీటి సంఘాల పాలన సాగింది. క్షేత్రస్థాయిలో కాలువపై ఏదైనా సమస్య తలెత్తితే రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నానా అవస్థలు పడేవారు. రైతుల అవసరాలను, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. గతేడాది సాగునీటి సంఘాల ఎన్నికలకు పూనుకుంది. ప్రాజెక్టు కమిటీలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, డబ్ల్యూఏలు అన్నింటికీ ఎన్నికలు నిర్వహించింది. డిసెంబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్తగా ఎన్నికైన వారికి బాధ్యతలు అప్పగించాలని స్పెషలాఫీసర్లను ఆదేశించింది. అలానే ఈ కమిటీలకు ఇప్పటివరకూ రూ.5 లక్షలలోపు పనులు మాత్రమే నామినేషన్ కింద చేసేందుకు అవకాశముండగా, ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచింది.
రూ. కోట్ల జీఎస్టీ ఎగనామం
2019 వరకూ సాగునీటి సంఘాల పేర్లపై రూ.వందల కోట్ల పనులు జరిగాయి. ఎక్కువగా నీరు-చెట్టు పనులే ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకున్నాక నీటి సంఘాల అధ్యక్షులు నిర్ధేశించిన జీఎస్టీ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. అయితే చాలా మంది జీఎస్టీలు కట్టలేదు. ఆ తర్వాత వచ్చిన స్పెషలాఫీసర్లు కూడా ఇదే దారిలో నడిచారు. నీరు-చెట్టు బిల్లులు రాకపోవడంతో నీటి సంఘాల అధ్యక్షులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత బిల్లులు పడ్డాయి. ఇటీవల కూడా ప్రభుత్వం నీరు-చెట్టు బిల్లులన్నింటినీ విడుదల చేసింది. ఇందులో నుంచి జీఎస్టీను పట్టుకొని మిగిలిన డబ్బులను పాత కమిటీ అధ్యక్షులకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా జీఎస్టీ మొత్తాలను కూడా లాగేశారు. అయితే కొన్ని సంఘాల ఖాతాల్లో మాత్రం జీఎస్టీ డబ్బులు అలానే ఉన్నాయి. చట్ట ప్రకారం స్పెషలాఫీసర్లు ఎప్పటికప్పుడు జీఎస్టీ బకాయిలను క్లియర్ చేసుకుంటూ రావాల్సి ఉండగా అలా చేయలేదు. దీంతో ఇప్పుడు ఆయా సంఘాలకు నోటీసుల మీద నోటీసులు అందుతున్నాయి. ఒక సంఘానికి రూ.5 లక్షలు కట్టాలని వస్తే, మరో సంఘానికి రూ.25 లక్షల వరకూ బకాయి ఉన్నారంటూ నోటీసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు, కమిటీ సభ్యులు బాధ్యతలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తు న్నారు.
మెమోల జారీ
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ఎన్నికలు నిర్వహించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఒక్కో కమిటీ కాలపరమితి రెండేళ్లు మాత్రమే. అంటే ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. మరి జీఎస్టీ సమస్యలు పరిష్కారమయ్యేదెప్పుడు? సాగునీటి సంఘాల కొత్త కమిటీలు బాధ్యతలు తీసుకునేదెప్పుడు..? అన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇరిగేషన్ ఎస్‌ఈ దేశానాయక్‌ను సంప్రదించగా.. కొన్ని కమిటీలు ఇంకా బాధ్యతలు తీసుకోలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. వెంటనే కొత్త కమిటీలకు బాధ్యతలు అప్పగించాలని సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!
సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
Read Latest AP News And Telugu News