Corruption in Housing Department: ఆ సారు.. పాపం పండింది..
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:23 PM
జిల్లా గృహ నిర్మాణ శాఖలో వైసీపీ హయాం నుంచి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడిన ఇన్‌చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.సాంబశివయ్య పాపం ఎట్టకేలకు పండింది..

ఎట్టకేలకు సస్పెన్షన్..
సిమెంటు, కడ్డీలు అమ్ముకున్నారు..
భార్య, కొడుకులకు ఫోన్‌పేలో మామూళ్లు
వైసీపీ హయాంలో లెక్కలేనన్ని అక్రమాలు
(రాయచోటి-ఆంధ్రజ్యోతి): జిల్లా గృహ నిర్మాణ శాఖలో వైసీపీ హయాం నుంచి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడిన ఇన్‌చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.సాంబశివయ్య (Sambasivayya) పాపం ఎట్టకేలకు పండింది.. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సిమెంటు, కడ్డీలు అమ్ముకోవడంతో పాటు.. తన కింద పనిచేసే సిబ్బంది నుంచి అక్రమ వసూళ్లు. ఆ వసూళ్లు తన భార్య, కొడుకుల ఫోన్‌పేలకే వేయించుకోవడం వంటి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖకు వచ్చిన నిర్ధిష్ట ఫిర్యాదుపై జరిగిన విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
వైసీపీ పరిపాలనా కాలం నుంచి ఈయన అవినీతి, అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. వైసీపీ నాయకులు చెప్పినట్లు చేయడంతో ఆయనపైన ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఈ నేపధ్యంలో ఏడాది కిందట కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇక ఈ సార్.. కథ అయిపోనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే ఏడాది వరకు ఇతడి అక్రమాలపై ఆంధ్రజ్యోతితో సహా ఇతర పత్రికల్లో వార్తలు వచ్చినా ఈ ప్రభుత్వంలోనూ చర్యలు తీసుకోలేదు. దీంతో ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించే వారని పలువురు అంటుండేవారు. ఈ నేపధ్యంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది.
ఇన్‌చార్జ్ పీడీపై వచ్చిన ఆరోపణల్లో కొన్ని...
హౌసింగ్ ఇన్‌చార్జ్ పీడీపై వచ్చిన ఆరోపణలపై గతంలో అప్పటి రాయచోటి ఆర్డీవో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఈయన ఆర్డీవోను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడినట్లు సిబ్బందే చెబుతున్నారు.
తన కింద పనిచేసే ఏఈ (ఎంఐసీ) పోస్టులను అమ్ముకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
నెలనెలా తనకు వచ్చే మామూళ్లను తన కింద పనిచేసే అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఫోన్‌పే నెంబర్లకు వేయించుకున్నాడని, తనకు మామూళ్లు ఇవ్వని సిబ్బందిని తన ఇష్టానుసారం బదిలీలు చేసి బెదిరించి.. తన దారికి తెచ్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు వసూళ్లు చేస్తాడనే ప్రచారం ఉంది.
జిల్లాలో ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో దాదాపు సుమారు 15 మంది ఎంఐసీ (ఏఈ) లు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఎంఐసీ ఉద్యోగం ఇచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉన్న కలెక్టర్ ఈ సర్టిఫికెట్లపై విచారణ జరిపించి బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించి ఉద్యోగాలు ఇవ్వనీయకుండా నిలుపుదల చేయించినా.. తర్వాత వచ్చిన కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
తన కింది స్థాయి సిబ్బందిని అందరి ముందే బండబూతులు తిట్టేవాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఈయన నిబంధనలకు విరుద్ధంగా ఓ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఏఈకి రెండు మండలాలు ఇన్‌చార్జ్ (లక్కిరెడ్డిపల్లె, గాలివీడు) ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
2024 జూన్‌లో ఎన్నికల ఫలితాల రోజు 120 ట్రాక్టర్ల ఇసుకను వైసీపీ నాయకులు అక్రమంగా తరలించారు. దీని వెనుక ఈయన హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈయన నెలలో చాలా వరకు బయట ప్రాంతాలకు క్యాంపులకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే ఉంటాడని, అయినా క్యాంపులకు వెళ్లినట్లు వేలాది రూపాయలు కారు బాడుగ పేరుతో తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
తన కింద పనిచేసే మండల ఇన్‌చార్జ్ (ఏఈ)ల దగ్గర తన భార్య, కొడుకుల ఫోన్‌పే నెంబర్లకు మామూళ్లు వేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఈయన హయాంలో జిల్లాలో సుమారు 10 వేలు పాత ఇళ్లకే బిల్లులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ నిర్మాణానికి, సుమారు 2 వేలకు పైగా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సిమెంటు బస్తాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
సాధారణంగా జిల్లా ప్రాజెక్టు అధికారిగా బీటెక్ చదివిన వాళ్లు అర్హులు. ఈయన పాలిటెక్నిక్ చదివారు. (అయితే ఈయన బీటెక్ చదివినట్లు సర్టిఫికెట్లు ఉన్నాయని, వాటిపైన విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.) అయినా మూడు సంవత్సరాల పాటు ఈయన జిల్లా అధికారిగా కొనసాగడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!
సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
Read Latest AP News And Telugu News