Share News

YS Sharmila: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , Publish Date - Feb 23 , 2025 | 05:03 PM

YS Sharmila: మిర్చి, టమాట రైతులను కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ధరలు పడిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.

 YS Sharmila: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
YS Sharmila

విజయవాడ: రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడికి పెట్టిన పైసలు రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతున్నారని చెప్పారు. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం .. మిర్చి రైతుల కళ్లలో కారం కొడుతుందని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడారు. మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు .. కూటమి ప్రభుత్వం గఫ్ఫాలు కొడుతుందని వైఎస్ షర్మిల చెప్పారు.


ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం .. లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారని వాపోయారు. కౌలు రైతుకు అదనంగా రూ.50 వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారని చెప్పారు. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. వెంటనే మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.26 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకొనేలా.. ధరల స్థిరీకరణ నిధిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతు విలవిల లాడుతుంటే టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయని వైఎస్ షర్మిల అన్నారు.


గిట్టుబాటు ధర, కనీసం పెట్టుబడి రాక, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ధరలు పడిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. మార్కెట్‌లో కేజీ టమాట రూ.15లు పలుకుతుంటే .. రైతుకు కిలో రూ. 3 నుంచి రూ. 4లు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన చోట రూ. 50 వేలు కూడా ఆదాయం లేదంటే .. టమాటా రైతుకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం అవుతుందని తెలిపారు. వెంటనే టమాటా రైతును ఆదుకోవాలని, టమాటా ధరలు పడిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Rammohan Naidu: ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర

YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు

YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 23 , 2025 | 05:09 PM