Women Conductor Controversy: చొక్కాపట్టి.. చెంపపై కొట్టి.. మహిళా కండక్టర్ దౌర్జన్యం
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:59 PM
Women Conductor Controversy: ఉయ్యూరు వెళ్లేందుకు పెద్దిబోయిన మల్లికార్జునరావు అనే వృద్ధుడు అంబేద్కర్ బొమ్మ సెంటర్లో బస్సు ఎక్కాడు. తాను ఎక్కడకు వెళ్లాలో చెప్పి కండక్టర్‌ను టికెట్ అడిగాడు. ఇందుకు గాను కండక్టర్‌కు రెండువందల నోటు ఇచ్చాడు.

కృష్ణా జిల్లా, జూన్ 27: ఓ వృద్ధ ప్రయాణికుడి పట్ల మహిళా కండక్టర్ (Women conductor ) ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బస్సుల్లో కండక్టర్లతో కొందరు ప్రయాణికులు గొడవపడుతుంటారు. అలాగే ప్రయాణికులతో కూడా పలువురు కండక్టర్‌లు దురుసుగా ప్రవర్తింటారు. ప్రధానంగా బస్సుల్లో టికెట్ తీసుకునే సమయంలో చిల్లర విషయంలోనే తరచూ కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. కానీ.. ఓ మహిళ కండక్టర్ మాత్రం వృద్ధుడి పట్ల రెచ్చిపోయి ప్రవర్తించింది. పెద్దాయన అని కూడా చూడా అతని పట్ల ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
కృష్ణా జిల్లా పామర్రులో వృద్ధ ప్రయాణికుడిపై ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్ వీరంగం సృష్టించింది. టికెట్ విషయంలో జరిగిన వివాదంలో వృద్ధుడి చొక్కా పట్టుకొని చెంపపై కొట్టింది ఉయ్యూరు డిపో మహిళా కండక్టర్. తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వెళుతున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ఉయ్యూరు వెళ్లేందుకు పెద్దిబోయిన మల్లికార్జునరావు అనే వృద్ధుడు అంబేద్కర్ బొమ్మ సెంటర్లో బస్సు ఎక్కాడు. తాను ఎక్కడకు వెళ్లాలో చెప్పి కండక్టర్‌ను టికెట్ అడిగాడు. ఇందుకు గాను కండక్టర్‌కు రెండువందల నోటు ఇచ్చాడు. అయితే తన దగ్గర చిల్లర లేదని.. చిల్లర ఇవ్వాలని కండక్టర్ అడిగింది. తన దగ్గర కూడా చిల్లర లేదని వృద్ధుడు చెప్పాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకుంది. అది కాస్తా తారాస్థాయికి చేరడంతో కండక్టర్ ఆగ్రహంతో ఊగిపోయింది.
చివరకు వృద్ధుడు మల్లికార్జునరావు చొక్కాపట్టుకుని మరీ కనకదుర్గ కాలనీ వద్ద దింపింది. అంతటితో ఆగకుండా వృద్ధుడి చెంపపై కొడుతూ దుర్భాషలాడింది . కండక్టర్ వీరంగం మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇరువురు మధ్య గొడవ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే మహిళా కండక్టర్ ప్రవర్తనపై గతంలోనూ అనేక ఫిర్యాదులు చేశామని స్థానికులు చెబుతున్నారు. కాగా.. ఈ వివాదంపై తోట్లవల్లూరు పోలీసులకు మాత్రం ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. వృద్ధుడి పట్ల మహిళా కండక్టర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్
సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
Read Latest AP News And Telugu News